వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సెకండ్ వేవ్ భారత్‌తోపాటు, ప్రధాని మోదీ ప్రతిష్టను ఏ స్థాయిలో దెబ్బ తీసింది? మోదీ తాను చేయాల్సినంత చేయగలిగారా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనా సెకండ్ వేవ్

''ఇప్పుడు మనం అక్కడ నుంచి సాయం పొందడం ఎలా?'' ఇది భారత విదేశాంగ విధానంపై అనేక పుస్తకాలు రాసి, అనేక దేశాలకు భారత రాయబారిగా పని చేసిన ప్రముఖ దౌత్యవేత్త రాజీవ్ డోగ్రా అడుగుతున్న ప్రశ్న.

'అక్కడ నుంచి' అంటే విదేశాల నుంచి అని అర్ధం. విదేశాల నుంచి సాయం పొందడాన్ని నిలిపి వేస్తూ గతంలో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, మహమ్మారి కారణంగా మారిన పరిస్థితుల్లో మళ్లీ విదేశీ సాయం కోరడం మొదలు పెట్టింది భారత్‌.

''అసలు మనమే ఇతరులకు సాయం చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇతరుల ముందు చేయి చాచడం ఎందుకు?'' అన్నది 2000 సంవత్సరం నుంచి వివిధ సందర్భాల్లో ప్రభుత్వం చర్చించిన అంశం..

రాజీవ్ డోగ్రా భారత్ తరఫున ఇటలీ, రొమేనియాలో రాయబారిగా పని చేశారు. 2004 సునామీ సమయంలో భారత్‌ కూడా విపత్తును ఎదుర్కొన్నా, విదేశాల నుంచి సాయం పొందకపోగా, తానే వాటికి సాయం చేసింది.

''సునామీ అనేక దేశాలలో వినాశనం సృష్టించింది. అయినా, మనం పరీక్షా సమయం ఎదుర్కొంటున్నామని, ఎవరినీ చేయిచాచి అడగవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైతే మనమే సాయం చేద్దామని అంది. అన్నట్లుగానే ఆగ్నేయాసియా దేశాలకు సాంకేతిక సహాయం కూడా చేసింది. సునామీ వినాశనాన్ని ఎదుర్కోవడంలో చాలా దేశాలకు సాయపడింది. సునామీ హెచ్చరికల టెక్నాలజీని కూడా అందించింది'' అన్నారు రాజీవ్ డోగ్రా.

విదేశాల నుంచి వచ్చిన సహాయంపై మే 8న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ట్విటర్‌లో చేసిన కామెంట్లు దేశపు నిస్సహాయతకు నిదర్శనమని సోషల్ మీడియా యూజర్లు విమర్శించారు.

విదేశీ సాయానికి సంబంధించి విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి వరసగా ట్వీట్లు చేశారు.

''అమెరికా నుంచి సింగపూర్, జర్మనీ, థాయ్‌లాండ్ వరకు, ప్రపంచమంతా భారత్‌కు అండగా నిలుస్తోంది'' అని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

''రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు, కాన్సంట్రేటర్ వంటి సహాయం సెకండ్ వేవ్‌పై పోరాటం కోసం భారత్‌కు చేరుకుంటోంది'' అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

భారత్ ఒకప్పుడు ఇతర దేశాలకు సాయం చేసిందని, ఇప్పుడు విదేశాల నుంచి సహాయం తీసుకుంటోందని విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ చేసిన ట్వీట్‌పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

''అవును, అమెరికా నుంచి థాయ్‌లాండ్ వరకు చాలా దేశాలు భారత్‌కు సాయం చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వాలు ప్రజలకు ఏమీ చేయడం లేదు'' అని దీక్షా రౌత్ అనే యూజర్ విమర్శించారు.

విదేశాల నుంచి సాయం కోరడం భారత గౌరవాన్ని దెబ్బతీయడమేనని చాలామంది ట్వీట్లు చేశారు.

కరోనా సెకండ్ వేవ్

మోదీపై నిరాశ పెరిగిందా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించారని చాలామంది నమ్మారు. దేశంలో రెండు వ్యాక్సీన్‌లు తయరు చేసిన తర్వాత ఆ నమ్మకం బలపడింది.

ప్రస్తుత సంక్షోభానికి దీటుగా భారత్ స్వయంగా పోరాడుతుందని కూడా చాలా మంది అనుకున్నారు. 'వ్యాక్సీన్ ఫ్రెండ్‌షిప్' స్కీమ్ గురించి ప్రధాని కూడా విస్తృతంగా ప్రచారం చేశారు.

భారత్ ఇకపై కేవలం ఒక దేశం కాదని, అంతర్జాతీయ శక్తి అని ప్రకటించారు. అయితే, ఇప్పుడు విదేశాల నుంచి అందుతున్న సాయం ఈ ఆత్మగౌరవ నినాదాన్ని దెబ్బతీసింది.

కరోనా సెకండ్ వేవ్

కరోనా బారి నుంచి ప్రపంచాన్ని భారత్ రక్షించిందని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో మోదీ ప్రకటించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం బలమైన ఆరోగ్య వ్యవస్థను రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు కూడా ఆయన మాటలను అంగీకరించాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారాన్ని ఎక్కువగా ఇష్టపడతారని, గొప్పలు చెప్పుకుంటారని రాజీవ్ డోగ్రా గతంలో కూడా విమర్శించారు.

''మన్మోహన్‌ సింగ్ ఏ పని చేసినా గుంభనంగా ఉండేవారు. అప్పట్లో సునామీ వచ్చినా, ఇతర దేశాలకు సాయం చేశారు. మాటల ద్వారా కాకుండా చేతలలో నిరూపించారు'' అన్నారు డోగ్రా.

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం ఎంత దారుణంగా ఉందో విదేశీ మీడియా కూడా చూపిస్తోంది. దేశ ఆరోగ్య వ్యవస్థ పతనం అంచున ఉందని వ్యాఖ్యానిస్తోంది. శ్మశానాల్లో శవాల గుట్టలు ఉన్నాయని, రోజంతా చితిమంటలు రగులుతూనే ఉన్నాయని కూడా విదేశీ మీడియా రాసింది.

రోగులు ఆక్సిజన్ కోసం, ఐసీయూ బెడ్ల కోసం అల్లాడుతున్నారని, వైద్య సహాయం అందక చాలామంది చనిపోతున్నారని, మృతదేహాలు నదులలో కనిపిస్తున్నాయని కూడా మీడియా పేర్కొందని డోగ్రా అన్నారు.

ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాజీవ్ డోగ్రా అన్నారు. డజన్ల కొద్దీ దేశాలు వైద్య సహాయాన్ని పంపుతున్నాయని, కొన్ని ఉచితం కాగా, మరికొన్నింటిని భారత్ కొనుక్కుంటోందని ఆయన చెప్పారు.

ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్ 'లాన్సెట్' ఇటీవల తన సంపాదకీయంలో ప్రధాని మోదీని విమర్శించింది.

''సంక్షోభాన్ని ఆపడంపై దృష్టి పెట్టడానికి బదులు, విమర్శకులను అణచి వేయడానికి మోదీ ప్రభుత్వం ఎక్కువ సమయం కేటాయిస్తోంది'' అని లాన్సెట్ అన్నది.

మరోవైపు మోదీ ప్రభుత్వంలోని అధికారులు కూడా విదేశాల నుంచి సాయం తీసుకోవడాన్ని సమర్ధిస్తున్నారు.

''ఒకప్పుడు మనం ఇచ్చాం. ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇది అంతర్జాతీయంగా భారత్‌ విశ్వసనీయతకు నిదర్శనం'' అని సీనియర్ దౌత్యవేత్త హర్షవర్ధన్ ష్రింగ్లా అభిప్రాయపడ్డారు.

అయితే, కొన్ని విషయాలను దాచి పెట్టాలనుకున్నా సాంకేతిక పరిజ్జానం వాటిని దాగనివ్వదని రాజీవ్ డోగ్రా అన్నారు.

''డ్రోన్లు గాలిలో తిరుగుతూ నదుల్లో తేలుతున్న మృతదేహాలను చిత్రిస్తుంటే, అది భారత్‌కు మంచి ఇమేజ్‌ను ఎలా ఇస్తుంది?'' అన్నారు డోగ్రా.

కరోనా సెకండ్ వేవ్

విదేశాల్లోని భారత సంతతి ప్రజల్లోనూ నిరాశేనా?

విదేశాలలో స్థిరపడిన భారత సంతతి ప్రజలు ఒకప్పుడు ప్రధాని మోదీకి గట్టి మద్ధతుదారులు. కానీ ఇప్పుడా వర్గాలలో కూడా మోదీ సమర్ధతపై చర్చ ప్రారంభమైంది.

2019 సెప్టెంబర్ 22న అమెరికాలోని హ్యూస్టన్‌లో ఒక భారీ స్టేడియంలో భారత సంతతి ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. అప్పట్లో ఆయన కీర్తి అత్యున్నత దశలో ఉంది.

భారతీయ సంతతికి చెందిన యోగేంద్ర శర్మ న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. ఆయన కూడా 'హౌడీ మోడీ' సభకు వెళ్లారు.

''అప్పట్లో మేమంతా మోదీని గుడ్డిగా నమ్మాం. మా కుటుంబం నోయిడాలో ఉంటుంది. నన్ను హ్యూస్టన్ వెళ్లమని వాళ్లు ఒత్తిడి చేశారు. కానీ, అదే మోదీ నేతృత్వంలోని భారత్‌ ఇప్పుడు తీవ్ర సమస్యల్లో ఉంది. చాలా దేశాలు భారత్‌కు సాయపడుతున్న తీరు చూస్తే తోపాటు భారతదేశ ఇమేజ్ ఎంత దుస్థితిలో ఉందో అర్ధమవుతుంది'' అన్నారు యోగేంద్ర శర్మ.

తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కొందరు కరోనాతో మరణించారని శర్మ అన్నారు.

కరోనా సెకండ్ వేవ్

ప్రశంసలు- విమర్శలు

ప్రపంచంలో ప్రతి దేశ నాయకుడిపైనా పొగడ్తలు, విమర్శలు రెండూ ఉంటాయని అచల్ మల్హోత్రా అన్నారు. ఆయన అర్మేనియాలో భారత రాయబారిగా పని చేశారు. ప్రస్తుత భారత విదేశాంగ విధానంపై ఆయన పుస్తకం రాశారు.

''ప్రశంసలు, విమర్శలు రాజకీయ జీవితంలో భాగం. సంక్షోభ సమయంలో ఇతర దేశాలతో ఎలా వ్యవహరించాలో మొదటి వేవ్ సందర్భంగా మోదీ ప్రపంచానికి చూపించారు. ఈ విధానాన్ని ప్రపంచం మొత్తం అంగీకరించింది కూడా'' అన్నారు మల్హోత్రా.

ప్రపంచంలో చాలామంది నాయకులు ఈ తరహా విమర్శలను ఎదుర్కొన్నారని, కరోనా సంక్షోభ సమయంలో మోదీ నిర్వహించిన పాత్రపై ప్రపంచ దేశాలు ఒక అభిప్రాయానికి వస్తాయని మల్హోత్రా అన్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రధాని మోదీని చైనాకు చెందిన ఒక ప్రముఖ మేధావి కూడా సమర్థించారు.

''ప్రధాని మోదీ భారత్‌లో ఇప్పటికీ బలమైన నాయకుడు. చైనా విద్యావేత్తలు, నిపుణులలో ఆయన మీద అంచనాలు వారు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉంటాయి'' అని ప్రొఫెసర్ హువాంగ్ యున్‌సెంగ్ బీబీసీతో అన్నారు.

ఆయన సిచువాన్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో పని చేస్తున్నారు.

ప్రొఫెసర్ హువాంగ్ యున్‌సెంగ్ అభిప్రాయం ప్రకారం, అమెరికా వంటి పెద్ద దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశాల వరకు సంక్షోభ సమయాల్లో ఎవరైనా విదేశాల సాయం కోరక తప్పదు.

''వైరస్ సమస్యను ఎదుర్కోవడంలో ఆయన వ్యవహరించిన తీరును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయి'' అన్నారు హువాంగ్ యున్‌సెంగ్.

కరోనా సెకండ్ వేవ్

వ్యాక్సీన్ ఫ్రెండ్‌షిప్ స్కీమ్

అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, 2004లో భారత్‌ విదేశీ సహాయం తీసుకోవడం నిలిపి వేయగా, ఇప్పుడు దాన్ని పునరుద్ధరించింది. కొన్ని నెలల క్రితం వరకు పేద దేశాలకు సహాయం చేస్తున్న పెద్ద దేశాలలో భారత్‌ కూడా ఉంది.

మహమ్మారిని ఎదుర్కోవడానికి గత సంవత్సరం భారత్‌ 100కి పైగా దేశాలకు ఔషధాలు పంపింది. సహాయంలో భాగంగా పొరుగు దేశాలకు సులభమైన నిబంధనలతో రుణాలు ఇచ్చింది. కరోనా వ్యాక్సీన్‌ కోసం ప్రపంచ ప్రచారంలో పాల్గొన్న ఫ్రంట్‌లైన్ దేశాలలో భారత్‌ కూడా ఒకటి.

అయితే, ఏప్రిల్ ఆరంభంలో కరోనా రెండో వేవ్ కారణంగా ఏర్పడ్డ దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోలేదని ప్రజలు భావిస్తున్నారు.

''ఈ రోజు మనం ఇతర దేశాల నుండి ఎందుకు సాయం పొందాల్సి వచ్చింది?'' అని మోదీ ప్రభుత్వాన్ని కొందరు నిలదీస్తున్నారు.

ఈ గ్లోబల్ వ్యాక్సీన్ ప్రచారంలో భాగంగా భారత ప్రభుత్వం చేసిన సాయానికి ''వ్యాక్సీన్‌ ఫ్రెండ్‌షిప్'' అని పేరు పెట్టారు.

ఇందులో భాగంగా డజన్ల కొద్దీ దేశాలకు వ్యాక్సీన్‌ను భారత్‌ సరఫరా చేసింది.

అయితే దేశంలోని 135 కోట్ల జనాభాకు ఎంత వ్యాక్సీన్‌ లభిస్తుందనే దానిపై కేంద్రం జాగ్రత్తలు తీసుకోలేదని దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇటీవల చేసిన ట్వీట్‌లో విమర్శించారు.

''విదేశాలకు పంపడానికి కేంద్రం దగ్గర 6.5 కోట్ల వ్యాక్సీన్లు ఉన్నాయి. రాష్ట్రం కేవలం 3.5 లక్షలు మాత్రమే అడిగింది. ఇక్కడ మనుషులు చనిపోతున్నా విదేశాలకు వ్యాక్సీన్లు సరఫరా చేయాలని బీజేపీ ప్రభుత్వం చెప్పదలుచుకుందా?'' అని సిసోడియా ప్రశ్నించారు.

అయితే, వ్యాక్సీన్ ఫ్రెండ్‌షిప్‌ను ఈ సందర్భంలో ప్రస్తావించడం సరికాదని అచల్ మల్హోత్రా అంటారు.

''వ్యాక్సీన్ల దేశీయ, విదేశీ వినియోగం విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలు, నాటి పరిస్థితుల నేపథ్యంలో చూడాలని నేను గట్టిగా నమ్ముతున్నాను'' అని మల్హోత్రా అన్నారు.

గతంలో జరిగిన నిర్ణయాల ఆధారంగానే విదేశాలకు వ్యాక్సీన్ పంపిణీ జరుగుతోందని ఆయన అన్నారు.

టీకా మన అవసరాలకు సరిపడా లేని సమయంలోనే సెకండ్ వేవ్ దేశాన్ని ఊపేసింది. సహజంగానే ఈ సమయంలో వ్యాక్సీన్ ఫ్రెండ్‌షిప్‌పై కొన్ని సందేహాలు వ్యక్తమవుతాయని మల్హోత్రా అన్నారు.

''వాస్తవానికి వ్యాక్సీన్ ఫ్రెండ్‌షిప్‌ కారణంగా ఏర్పడిన విశ్వసనీయత ప్రస్తుత సంక్షోభంలో విదేశీ మిత్రుల సహాయాన్ని పొందడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది'' అని మల్హోత్రా అన్నారు.

కానీ, రాజీవ్ డోగ్రా అభిప్రాయం ప్రకారం టీకాల కర్మాగారమైన భారతదేశ ప్రతిష్ట మాత్రం మసకబారింది.

కరోనా సెకండ్ వేవ్

ఎంత నష్టం?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, భారత్‌లో గత కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో ప్రభుత్వానికి, దేశానికి అప్రతిష్ట మిగిలింది. ప్రధాని మోదీ సమర్ధత పైనా ప్రశ్నలు తలెత్తాయి. అయితే మూడో వేవ్‌కు సన్నాహాలు సరిగ్గా జరిగితే... దెబ్బతిన్న ఇమేజ్ మెరుగు పడుతుంది.

"ఒక దేశం విదేశీ సహాయాన్ని అంగీకరించే స్థితిని బట్టి దాని ఇమేజ్‌ను నిర్ధరించడం అన్యాయం. అత్యవసర సమయాల్లో అమెరికాతోపాటు అనేక ధనిక దేశాలు విదేశీ సాయం పొందాయి'' అని ప్రొఫెసర్ హువాంగ్ యున్‌సెంగ్ అన్నారు.

గత ఏడాది, ఈసారి సంక్షోభాన్ని ముంబై ఎంత బాగా ఎదుర్కొందో చెప్పడానికి 'ధారావి' ప్రాంతం ఒక ఉదాహరణ అని రాజీవ్ డోగ్రా అన్నారు. ఆయన దృష్టిలో, దేశంలోని ఇతర నగరాలు, రాష్ట్రాలు ముంబైలో అనుసరించిన సూత్రాన్ని అవలంబిస్తే, విదేశాల నుంచి సాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు.

సెకండ్ వేవ్ కారణంగా భారత్‌, ప్రధాని మోదీల ఇమేజ్‌లకు ఎంత నష్టం జరిగిందనే దానిపై ప్రజల్లో భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు. కానీ, విస్తృతంగా చూస్తే, 2020 మార్చి నుండి 2021 మార్చి మధ్య కాలంలో ఆయన తాను చేయగలిగింది చేశారని ఎవరూ అనడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Corona Second Wave Along with India, to what extent has Prime Minister Modi's reputation been damaged
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X