Covid 19 BF7 Virus : కరోనా కొత్త వైరస్ లక్షణాలివే- ఈ జాగ్రత్తలతో కాపాడుకోండిలా..
భారత్ లో కరోనా వైరస్ కొత్తరకం బీఎఫ్ 7 కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో ఈ కొత్త రకం వైరస్ పై భయాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఒమిక్రాన్ రకానికి చెందినదిగా చెబుతున్న ఈ కొత్తరకం బీఎఫ్ 7 వైరస్ లక్షణాలు ఎలా ఉంటున్నాయి, ముందుజాగ్రత్తలు ఎలా తీసుకోవాలన్న దానిపై నిఫుణులు కీలక సూచనలు చేస్తున్నారు.
గతంలో భారత్ లో బయటపడిన ఒమిక్రాన్ వైరస్ రకం పేరు బీఎఫ్ 5. ఇప్పుడు దాన్ని ఉప రకం బీఎఫ్ 7 బయటపడింది. ఇది ఇప్పటికే చైనాలో భారీ ఎత్తున ప్రభావం చూపుతున్న నేపథ్యంలో భారత్ లోనూ ఆందోళన పెరుగుతోంది. అయితే అధికారికంగా గుర్తించిన కేసులు మాత్రం నాలుగే. గుజరాత్ లో రెండు, ఒడిశాలో రెండు కేసులు మాత్రం అధికారికంగా గుర్తించారు. అయినా అప్రమత్తంగా ఉండాల్సిందేనని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్తరకం బీఎఫ్ 7 లక్షణాలు ఎలా ఉంటున్నాయన్నది చూద్దాం..

ఇది తక్కువ ఇంక్యుబేషన్ పీరియడ్‌తో అత్యంత ఎక్కువగా వ్యాప్తిచెందే రకంగా గుర్తించారు. ఇది ఒకరి నుంచి మరొకరకి సోకేందుకు కారణమయ్యే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కూడా నిర్ధారించారు. అలాగే టీకాలు వేసిన వ్యక్తులకు కూడా సోకుతుందని నిర్ధారణ అయింది. తాజాగా ఓ సైన్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, అసలు వుహాన్ లో బయటపడిన వైరస్ కంటే ఈ బీఎఫ్ 7 వేరియంట్ 4.4 రెట్లు అధిక న్యూట్రలైజేషన్ నిరోధకత కలిగి ఉన్నట్లు గుర్తించారు. అంటే టీకా నుండి వచ్చే ప్రతిరోధకాలు వైరస్‌కు వ్యతిరేకంగా తగినంత ప్రభావవంతంగా ఉండవని తెలుస్తోంది.
ఈ బీఎఫ్ 7 ఒమిక్రాన్ రకం వైరస్ కారణంగా జ్వరం, గొంతు నొప్పి, ముక్కు నుంచి నీరు కారటం, దగ్గు, ఎగువ శ్వాసకోశ సంక్రమణ వంటి లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు. కొంతమంది రోగుల్లో అతిసారం, వాంతులు వంటి కడుపు సంబంధిత సమస్యలు కూడా ఉంటున్నాయి. ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి తీవ్రత తక్కువగా ఉంటున్నా వ్యాప్తి మాత్రం ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

కోవిడ్‌కు నిబంధనల్ని పక్కాగా పాటించడం ద్వారా ఈ కొత్త వేరియంట్ నుంచి దూరంగా ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. మన దేశంలో డిసెంబర్, జనవరి నెలల్లో జలుబు, దగ్గు, ఇతర సీజనల్ వ్యాధులు సాధారణమే. అయితే వీటిని ఈసారి నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు చెప్తున్నారు. మీరు లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా పైన పేర్కొన్న లక్షణాలను అనుభవిస్తే, వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని చెప్తున్నారు. అలాగే ఐసోలేషన్ లో ఉండాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications