ఈ 4 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత- కేంద్రం సమీక్ష
Covid 19 cases in India: కరోనా వైరస్ కేసుల సమస్య మళ్లీ తలెత్తింది. దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి కూడా. వివిధ రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించింది. ఎప్పటికప్పుడు ఆరా తీస్తోన్నామని పేర్కొంది.
దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ (EMR), డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS)అధికారులు ఇందులో పాల్గొన్నారు.

ప్రధానంగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అధికంగా నమోదైనట్లు వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్, పాన్ ఇండియా రెస్పిరేటరీ వైరస్ సెంటినెల్ సర్వైలెన్స్ నెట్‌వర్క్ ద్వారా కోవిడ్-19 సహా శ్వాసకోశ వ్యాధులపై ఎప్పటికప్పుడు ఆరా తీయడానికి, వాటిని పర్యవేక్షించడానికి దేశవ్యాప్త నెట్ వర్క్ ఉందని పేర్కొన్నారు.
ఈ కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటివేనని, వాటి తీవ్రత తక్కువ శాతంగా ఉంటోందని అధికారులు చెప్పారు. పాజిటివ్ గా తేలిన వారు డొమెస్టిక్ ఐసొలేషన్ లో ఉంటోన్నారని అన్నారు. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుదలపై తాము అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.
కొన్ని రోజులుగా సింగపూర్, హాంకాంగ్‌లల్లో కోవిడ్ 19 పాజిటివ్ కేసుల పెరుగుదల ఉంటోందని, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం- ఆయా కేసుల తీవ్రత చాలావరకు స్వల్పమేనని కేంద్ర కార్యదర్శి పునరుద్ఘాటించారు. ఆయా కేసుల్లో అసాధారణ తీవ్రత లేదని, ఈ వైరస్ బారిన పడ్డ వాళ్లెవరూ కూడా మరణించలేదని అధికారులు పేర్కొన్నారు.
దేశంలో ప్రస్తుతం కోవిడ్ 19 పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అన్నారు. సోమవారం నాటికి దేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 257గా నమోదైంది. దేశ జనాభాను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువేనని, వీటి తీవ్రత కూడా స్వల్పంగానే ఉందని, ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.












Click it and Unblock the Notifications