ద్వారకా నగరం వైపుదూసుకొస్తోన్న పెను తుఫాన్: పోటెత్తుతున్న తీరం
అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ బిపర్‌జాయ్ మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. గుజరాత్ తీరం వైపు దూసుకొస్తోన్న ఈ తుఫాన్ అంతకంతకూ బలపడుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ గజగజ వణికిపోతోంది. అటు పాకిస్తాన్ తీరంపైనా ఈ తుఫాన్ ప్రభావం పడింది. బుధవారం జఖావ్ పోర్ట్ వద్ద తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
మంగళవారం తెల్లవారు జామున 5:30 గంటల సమయానికి పోర్బందర్‌కు నైరుతి దిశగా 300 కిలోమీటర్లు, దేవభూమి ద్వారక నగరానికి 290, జఖావ్ పోర్ట్‌కు 340, నలియా తీరానికి 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో గుజరాత్ తీరం వైపు కదులుతోంది. బుధవారం మధ్యాహ్నం తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జఖావ్ పోర్ట్ వద్ద తీరాన్ని తాకుతుందని తెలిపింది.

దీని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. సౌరాష్ట్ర, కఛ్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ద్వారక, నలియాల్లో అర్ధరాత్రి నుంచి ఓ మోస్తరు వర్షం పడిందని, తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ తీవ్రత పెరుగుతుందని అహ్మదాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లకూడదని సూచించింది.
సౌరాష్ట్ర, కఛ్ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో- గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను మోహరింపజేసింది. మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించింది. తుఫాన్ ప్రభావానికి గురయ్యే పట్టణాల్లో ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించింది. వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది.
తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్, మహారాష్ట్రలో వర్ష తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. ఇవ్వాళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మరోసారి తుఫాన్ ప్రభావంపై సమీక్ష నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications