స్వాతంత్య్ర దినోత్సవం నాడు తీవ్ర విషాదం.. ఢిల్లీలో కుప్పకూలిన దర్గా !
దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల ప్రభావంతో చారిత్రక హుమాయున్ సమాధి సమీపంలోని ఓ దర్గా పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు పర్యాటకులు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాపాయ ఉన్నట్టు సమాచారం.
ఏం జరిగిందంటే..?
ఈరోజు ( ఆగస్టు 15, 2025 ) సాయంత్రం సుమారు 4:30 గంటల ప్రాంతంలో, ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్న మొఘల్ చక్రవర్తి హుమాయున్ సమాధి వెనుక భాగంలోని దర్గా పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ప్రాథమిక అంచనాల ప్రకారం 10-12 మంది వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిందన్న సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.

ఢిల్లీ అగ్నిమాపక దళ అధికారి ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఐదు అగ్నిమాపక యంత్రాలను అక్కడికి తరలించారు. రక్షణ చర్యల్లో భాగంగా ఇప్పటివరకు 12 మందిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే ఇంకా శిథిలాల కింద సుమారు 8-10 మంది ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారని తెలిపారు.
అయితే గత రెండు రోజులుగా ఢిల్లీలో కురుస్తున్న నిరంతర వర్షాల కారణంగా ఈ దర్గా పైకప్పు బలహీనపడి కూలిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 16వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మితమైన హుమాయున్ సమాధి, దాని పరిసర ప్రాంతంలోని నిర్మాణాలు పర్యాటకులకు ఆకర్షణీయ ప్రదేశాలు. ఈ ప్రమాదం ఆ ప్రాంతాన్ని సందర్శించిన వారిలో భయాందోళనలు రేకెత్తించింది.
ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ ఘటనలో కొందరు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే అధికారికంగా మరణాల సంఖ్యను ఇంకా ధృవీకరించలేదు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా, పోలీసులు పరిసర ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఈ ఘటన పట్ల మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications