కమలం మహా ప్రభంజనం: కేజ్రీవాల్, ఆతిషీ సైతం వెనుకంజ
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతోన్నాయి. ప్రారంభ ఫలితాల్లో బీజేపీ దూకుడు కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానంలో ఆధిక్యతలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకపడినట్టే. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఢిల్లీతో పాటు తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్, ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక ఓట్లనూ లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచీ ఈ రెండు పార్టీలను కాదని ఆమ్ ఆద్మీకే పట్టం కడుతూ వచ్చారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తోన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌కు ఏ మాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి.
ఈ దఫా ఈ పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. బీజేపీ సంపూర్ణ మెజారిటీని సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. 35 నుంచి 45 వరకు నియోజకవర్గాల్లో బీజేపీ పాగా వేస్తుందని, ఆయా చోట్ల కాషాయ జెండా ఎగురుతుందంటూ అభిప్రాయపడ్డాయి. ఇవి వాస్తవరూపాన్ని దాల్చేలా కనిపిస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేశారు. బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ మధ్య ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఇక్క అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. పర్వేష్ వర్మ ఆధిక్యతలో కొనసాగుతున్నారు ప్రారంభ ఫలితాల్లో.
కల్కాజీ నుంచి బరిలో దిగిన ముఖ్యమంత్రి అతిషి సైతం వెనుకపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరీ ఇక్కడ ఆధిక్యతలో ఉన్నారు. జంగ్‌పురా నుంచి పోటీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీకి చెందిన తర్వీందర్ సింగ్ మర్వా ఆధిక్యత సాధించారు.












Click it and Unblock the Notifications