నాకేమీ తెలియదు.. నేనేమీ చూల్లేదు- ఇలా చెబితే ఎలా తల్లీ
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వెలువడుతోన్నాయి. బీజేపీ ప్రభంజనం కనిపించింది. ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకపడినట్టే. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి అనుగుణంగా ఫలితాలు వెలువడుతున్నాయి. క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది బీజేపీ.

ముఖ్యమంత్రి ఆతిషి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కీలక అభ్యర్థులు వెనుకంజలో నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2020 తరహాలో ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవనే సంకేతాలను ఇచ్చినట్టయింది.
వెనుకంజలో ఉన్న కీలక అభ్యర్థుల్లో.. అరవింద్ కేజ్రీవాల్- న్యూఢిల్లీ, అతిషి- కల్కాజీ, మనీష్ సిసోడియా- జంగ్‌పురా, దుర్గేష్ పాఠక్- రాజీందర్ నగర్, మంత్రి గోపాల్ రాయ్- బాబర్‌పూర్, మనోజ్ త్యాగి- కరావల్ నగర్, అనిల్ ఝా- కిరారీ, దినేష్ మొహానియా - సంగం విహార్, వినయ్ మిశ్రా- ద్వారకా.. వంటి ఆప్ అభ్యర్థలు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టడం కూడా గగనమైంది ఈ ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో కూడా జీరో కావడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఒక దశలో హస్తినాపురిలో ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. దివంగత మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సారథ్యంలో హ్యాట్రిక్ సైతం కొట్టింది కాంగ్రెస్. ఇప్పుడా పార్టీ- ఒక్క సీటు కూడా గెలుచుకోలేని దుస్థితిలో పడింది.
కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లిందనేది ఇక్కడ స్పష్టమౌతోంది. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో దారుణంగా ఓడిపోయిన తరువాత కాంగ్రెస్ ఇక కోలుకోలేకపోయింది. ఇప్పటికీ కోమాలోనే ఉంటూ వస్తోంది. ఈ ఎన్నికల పట్ల కొద్దో గొప్పో ఆశలు ఉన్నప్పటికీ- అది అడియాశే అయిందని ఫలితాలు స్పష్టం చేస్తోన్నాయి.
ఈ పరిణామాలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్ లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ఢిల్లీ నుంచి ఈ ఉదయమే ఆమె కేరళకు చేరుకున్నారు. వాయనాడ్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. కన్నూర్‌లో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు.
#WATCH | Kannur, Kerala | Speaking on Delhi election results, Congress MP Priyanka Gandhi Vadra says, "I don't know, I haven't checked the results yet." pic.twitter.com/L3CujdaraO
— ANI (@ANI) February 8, 2025
ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ఇంకా తాను వాటిని చెక్ చేయలేదని ప్రియాంక గాంధీ వాద్రా సమాధానం ఇచ్చారు. ఢిల్లీ ఫలితాలపై నాకేమీ తెలియదు. ఇంకా రిజల్ట్ గురించి తెలుసుకోలేదు.. అంటూ నవ్వుతూ ఒక్క ముక్కలో బదులిచ్చి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications