ఉన్నట్లుండి కూలిపోయిన భారీ బిల్డింగ్ - లోపల 50 మంది విద్యార్ధులు ?
దేశ రాజధాని ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్కే పురం నియోజకవర్గ పరిధిలోని స్థానిక శివ మందిరం సమీపంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల పాత భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ భారీ ప్రమాద సమయంలో (Delhi Building Collapse) భవనంలో ఉన్న పెయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహానికి చెందిన పలువురు విద్యార్థులతో పాటు, అక్కడ పనులు చేస్తున్న కొంతమంది నిర్మాణ కార్మికులు కూడా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర విభాగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ), ఢిల్లీ పోలీస్, ఎంసీడీ బృందాలు సంయుక్తంగా రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న మరో నివాస భవనాన్ని కూడా అధికారులు ఖాళీ చేయించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి ఉన్నత చదువుల కోసం వచ్చి ఇక్కడ పీజీ వసతి గృహాలలో నివసిస్తున్న విద్యార్థులు ఈ శిథిలాల కింద చిక్కుకున్నారని తెలిపారు. శిథిలాల లోపలి నుంచి కొందరు విద్యార్థులు ఫోన్ కాల్స్ చేస్తూ తమను కాపాడాల్సిందిగా వేడుకుంటున్నారని ఆయన వెల్లడించారు.

ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్పందించారు. బాధితులను సురక్షితంగా రక్షించడం, వారికి తక్షణ సహాయం అందించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని తెలిపారు. ఈ పాత భవనంలో నిబంధనలకు విరుద్ధంగా బేస్ మెంట్ నిర్మాణం , ఆధునీకరణ పనులు చేపడుతుండటమే ఈ ఘోర ప్రమాదానికి దారితీసినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. కింద భాగంలో బేస్ మెంట్ తవ్వకాలు జరుపుతున్న సమయంలో పిల్లర్లు తీవ్రంగా బలహీనపడి భవనం ఒకేసారి కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదో పెద్ద భూకంపం వచ్చినట్లు శబ్దం వినిపించిందని, క్షణాల వ్యవధిలోనే మొత్తం నేలమట్టమై పొగ, దుమ్ముతో నిండిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శిథిలాల కింద నుంచి కొందరిని సురక్షితంగా బయటకు తీయగా, సహాయక చర్యలు సాగుతున్నాయి.













Click it and Unblock the Notifications