Spain migrant boat tragedy: ఘోర పడవ ప్రమాదం.. 83 మంది కార్మికులు మృతి?
స్పెయిన్ సమీపంలోని అట్లాంటిక్ మాహా సముద్రంలో ఉన్న కేనరీ ఐలాండ్స్ వద్ద ఘోర పడవ ప్రమాదం జరిగింది. వెస్ట్ ఆఫ్రికా నుంచి వస్తున్న వలస కార్మికుల పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో దాదాపు 83 మంది కార్మికులు మృతి చెందినట్లు మైగ్రాంట్ రైట్స్ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్ వ్యవస్థాపకుడు హెలీనా మలేనో తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే స్పెయిన్ అధికారులు మాత్రం కేవలం ఐదు మృతదేహాలు మాత్రమే లభ్యం అయ్యాయని చెబుతోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో గల్లంతైన వారికోసం గాలింపు చేపట్టినట్లు సమాచారం అందుతోంది.
మునిగిపోయిన పడవ నుంచి గాయపడిన ముగ్గురిని విమానం ద్వారా సమీప ఆస్పత్రికి తరలించామని స్పెయిన్ అధికారులు తెలిపారు. మరో 41 మంది కార్మికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి పోర్టుకు తరలించామన్నారు. అక్కడ వారికి రెడ్ క్రాస్ నుంచి వైద్యం అందుతోందని వివరించారు. ఈ ఘటనపై రెడ్ క్రాస్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఈ కార్మికులంతా మాలి, సెనెగల్ దేశాల నుంచి వచ్చారని అన్నారు. రక్షించిన వారిలో కూడా చాలా మంది ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందన్నారు.
ఇక ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రత్యక్ష సాక్ష్యులు మాట్లాడుతూ.. ఒక నెల రోజుల క్రితం గాంబియా నుంచి పడవ స్టార్ట్ అయింది. మా ఫుడ్, వాటర్ సరఫరా పూర్తిగా అయిపోయింది. దాంతో మాకు బలవంతంగా సముద్రం నీళ్లు తాగిపించారు. ఇన్ని రోజుల జర్నీలో సరైన ఆహార, వైద్య సదుపాయాలు లేక మేమంతా బలహీనంగా, అనారోగ్యంతో ఉన్నాం. పడవ స్టార్ట్ అయ్యే సమయంలో 100 మందికి పైగా వలస కార్మికులం ఉన్నాం. అందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.. అని తెలిపారు. ఈ జర్నీలో మార్గ మధ్యలో చనిపోయిన వారిని సముద్రంలోకి విసిరేశారని ఆ లెక్కల్ని స్పెయిన్ అధికారులు బయటపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు పడవలో అధిక రద్దీ కారణంగానే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో ఇదే రూట్ లో ప్రయాణించిన వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు ఉన్నాయి. స్పెయిన్ లోని కేనరీ ఐలాండ్స్ రూట్ చాలా ప్రమాదకరమైనదిగా చెబుతారు. ఇక్కడి ప్రతికూల వాతావరణం ప్రయాణానికి ఇబ్బందిగా ఉంటుందని అంటారు.












Click it and Unblock the Notifications