ఈసీ వివాదం: 'ప్రజాస్వామ్యం ఎక్కడ?' SIRపై ఓటర్ల ఆగ్రహం!
ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ(SIR-సర్) ప్రక్రియ భారత ఎన్నికల సంఘంలో తీవ్ర కలకలం రేపుతోంది. అర్హులైన ఓటర్ల పేరును జాబితా నుంచి తొలగించడం, అలాగే అధికారిక నిర్ణయాలలో పారదర్శకత లోపించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 10 నెలల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీలు ఈసీ తీసుకున్న పలు నిర్ణయాలపై దాదాపు 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడటంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఓటర్ల తొలగింపును 'అనిధికారికమైనది, చట్టవిరుద్ధమైనది' అని కమిషనర్ సంధు లిఖితపూర్వకంగా పేర్కొనడం ఎన్నికల సంఘం అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది.
ఓటర్ల జాబితా ప్రక్రియ పరిమాణం ఈ చర్చను మరింత తీవ్రతరం చేసింది. SIR మూడో దశలో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 6.15 కోట్ల మంది ఓటర్లు ముసాయిదా జాబితాల నుంచి మాయమయ్యారు. వీరిలో 4.52 కోట్ల మంది గైర్హాజరైనట్లు, 1.11 కోట్ల మంది మరణించినట్లు, 49.58 లక్షల మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు వర్గీకరించారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 36.08 కోట్ల నుంచి 29.93 కోట్లకు పడిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల జాబితాతో పోలిస్తే ఇది నికరంగా 15.7 శాతం(దాదాపు 5.57 కోట్లు) తగ్గుదలను సూచిస్తోంది. అయితే తొలగించబడిన ప్రతి ఒక్కరూ అనర్హులు కాదని, అభ్యంతరాలు తెలిపి పేర్లను పునరుద్ధరించుకోవడానికి ఈసీ అవకాశం ఇచ్చినప్పటికీ.. పెద్ద ఎత్తున గైర్హాజరుగా వర్గీకరించబడటం అనుమానాలకు తావిస్తోంది.

ఈ వివాదం ఇప్పుడు కేవలం ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల మధ్యనే కాకుండా, ఓటర్ల మధ్య కూడా కొనసాగుతోంది. వన్‌ఇండియా నిర్వహించిన ఓ అభిప్రాయ సేకరణలో SIR ప్రక్రియపై స్థానికులు తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఎన్నికల సంఘంపై నమ్మకం కోల్పోయామని కొందరు చెప్పగా.. మరికొందరు ఎన్నికల సంఘంపై తమ విశ్వాసం కొనసాగుతోందని, నకిలీ, వేరే చోటికి మారిన లేదా ఇతరత్రా అనర్హమైన పేర్లను తొలగించడానికి ఈ సవరణ అవసరమని తాము నమ్ముతున్నామని తెలిపారు.
ఆటోడ్రైవర్ రాజన్న మాట్లాడుతూ.. పాత జాబితాలో ఉండి ప్రతిసారీ ఓటు హక్కును వినియోగించుకుంటున్న తమ కుటుంబంలోని నలుగురు పేర్లు కొత్త జాబితాలో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ పత్రాలు, ఫోటోలతో ఆఫీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయిందని.. రెక్కాడితే గానీ డొక్కాడని తమలాంటి వారికి ఈ ప్రక్రియ నరకంగా మారిందని వాపోయారు. అలాగే క్యాబ్ డ్రైవర్ నవీర్, మరో వ్యక్తి శంకర్‌లు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలోనే నివసిస్తున్నా తమ ఓటు హక్కు రద్దవ్వడంతో ఎన్నికల వ్యవస్థపైనే నమ్మకం పోయిందని ఆందోళన చెందారు.
అయితే ఈ SIR ప్రక్రియను సమర్థించే వారు కూడా లేకపోలేదు. నకిలీ ఓట్లను, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించడానికి ఇటువంటి సవరణలు అవసరమేనని బీజాపూర్‌కు చెందిన శివానంద్ అభిప్రాయపడ్డారు. ప్రియ అనే యువతి మాట్లాడుతూ.. ఈ సవరణ అవసరమే అయినప్పటికీ సరైన పద్ధతిలో జరగాలని, బతికి ఉన్న తమ అమ్మమ్మ పేరును తొలగించి చనిపోయిన వారి పేర్లను జాబితాలో కొనసాగించడం నిర్వహణ లోపానికి నిదర్శనమని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ.. లక్షలాది మంది ఓటు హక్కు కోల్పోవడం రాబోయే ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. నిష్పక్షమైన ఓటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం వెంటనే పారదర్శక చర్యలు చేపట్టాలని ఓటర్లు కోరుతున్నారు.













Click it and Unblock the Notifications
