శర్వానంద్ 'జార్జ్ క్రిష్' గ్లింప్స్ రిలీజ్.. దర్శకుడు శ్రీను వైట్ల కమ్ బ్యాక్ ఇచ్చారా..!
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. హిట్స్.. ప్లాఫ్స్ ను పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా 'నారీ నారీ నడుమ మురారి' చిత్రంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన శర్వానంద్.. ఆ తర్వాత 'బైకర్' సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. శర్వానంద్, రాజశేఖర్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. ఇక ప్రస్తుతం భోగి అనే సినిమా చేస్తున్నారు శర్వానంద్. ఈ చిత్రానికి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం భోగి చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

భోగి చిత్రంతో పాటు శర్వానంద్.. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో 'జార్జ్ క్రిష్' అనే సినిమా చేస్తున్నారు. అయితే ఇవాళ దర్శకుడు శ్రీను వైట్ల బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ బూస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో శర్వానంద్ రెండు విభిన్నమైన గెటప్ లలో ఆకట్టుకున్నారు. చర్చిలో ఫాదర్ గా అలాగే క్రిష్ణ భక్తుడిగా అలరించారు. జార్జ్ అనే పేరుతో క్రిస్టియన్ గా క్రిష్ అనే పేరుతో కృష్ణుడి భక్తుడిగా ఈ మూవీలో శర్వానంద్ అలరించనున్నట్లు ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే స్పష్టం అవుతోంది. మొత్తానికి ఈ ఫస్ట్ బూస్టర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచిందని చెప్పొచ్చు. ఇక జార్జ్ క్రిష్ మూవీలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. దర్శకుడు శ్రీను వైట్ల ఇదివరకు బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నారు. వెంకీ, ఢీ, రెడీ, దూకుడు, బాద్ షా, బ్రూస్ లీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే ఆ తర్వాత ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. గతేడాది గోపీచంద్ తో ఓ సినిమా చేశారు. ఇప్పుడు శర్వానంద్ తో జార్జ్ క్రిష్ చిత్రం చేస్తున్నారు. ఇక ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో నిలిచిన ఈ సినిమాతో శ్రీను వైట్ల మళ్లీ కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.












Click it and Unblock the Notifications
