బేబీబాస్ దెబ్బకు సీనియర్లకు షాక్?.. మాజీ క్రికెటర్ సెన్సేషనల్ కామెంట్స్!
రాబోయే 6 నెలల్లో భారత టీ20 జట్టు ఎంపికలో బీసీసీఐ తలనొప్పిని ఎదుర్కొనే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ ప్రదర్శనతో టీమిండియా తుది జట్టులోకి దూసుకురావడం ఖాయిమని.. దీని వల్ల ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న తిలక్ వర్మ లేదా ఆల్ రౌండర్ శివం దూబేలలో ఒకరు తమ స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందని కైఫ్ జోస్యం చెప్పారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన మహమ్మద్ కైఫ్.. వైభవ్ సూర్యవంశీ చూపిస్తున్న ఫామ్ ముందు సీనియర్ ఆటగాళ్లు తప్పుకోక తప్పదని స్పష్టం చేశారు.
తిలక్ వర్మ జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ.. గతంలో వైస్ కెప్టెన్లను కూడా జట్టు నుంచి తప్పించిన సందర్భాలు ఉన్నాయని కైఫ్ గుర్తుచేశారు. మరోవైపు శివం దూబే ప్రతి మ్యాచ్ లోనూ పరుగులు సాధించలేకపోతున్నాడని.. పైగా ఫీల్డింగ్ కూడా అతని ప్రధాన బలహీనత అని పేర్కొన్నారు. శివం దూబే పూర్తి స్థాయి బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా కాకుండా కేవలం బ్యాటర్‌గానే ఆడుతున్నారని, ఈ పరిస్థితుల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు ముందు తిలక్ లేదా దూబేలలో ఒకరిని తప్పించడం తప్ప వేరే మార్గం ఉండదని ఆయన విశ్లేషించారు.

కేవలం టీ20ల్లోనే కాకుండా దులీప్ ట్రోఫీలో కూడా వైభవ్ సూర్యవంశీ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడని, అక్కడ బౌలింగ్ కూడా చేస్తూ తన ఆల్ రౌండ్ నైపుణ్యాన్ని పెంచుకున్నాడని కైఫ్ కొనియాడారు. బౌలింగ్ చేయడం వల్ల జట్టులో వైభవ్ సూర్యవంశీకి మరింత అదనపు ప్రయోజనం లభిస్తుందని ఆయన అన్నారు. 2026లో తాను ఆడిన మొదటి 6 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ 189.22 స్ట్రైక్ రేట్‌తో 193 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో కూడా 237.51 స్ట్రైక్ రేట్‌తో 72 సిక్సర్లతో ఏకంగా 776 పరుగులు చేసి సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
మరోవైపు తిలక్ వర్మ 2026లో టీ20ల్లో 35.91 సగటుతో 395 పరుగులు చేసినప్పటికీ.. అతను సాధించిన హాఫ్ సెంచరీ మ్యాచ్ ఓడిపోయిన సమయంలో రావడం, అలాగే స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేటప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడటం తిలక్ వర్మకు మైనస్ గా మారింది. శివం దూబే కూడా ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్‌లో మంచి స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసినప్పటికీ.. కైఫ్ అంచనాల ప్రకారం వైభవ్ సూర్యవంశీ చూపిస్తున్న విధ్వంసకర ఫామ్ ముందు రాబోయే రోజుల్లో భారత టీ20 తుది జట్టులో సీనియర్లకు చోటు దక్కడం కష్టమేనని స్పష్టమవుతోంది.














Click it and Unblock the Notifications
