కేజ్రీవాల్ ఓట్ల వేట: పెట్రోల్‌పై వ్యాట్ కట్: లీటర్‌పై రూ.8 తగ్గింపు
న్యూఢిల్లీ: ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఓట్ల వేటను మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. వచ్చే ఏడాది నిర్వహించబోయే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సమాయాత్తమౌతోన్న ఆమ్ ఆద్మీ.. ఢిల్లీలో నుంచే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలకు తెర తీసింది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, గోవా, మణిపూర్..అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోండగా.. మణిపూర్ మినహాయించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేయనుంది.

పంజాబ్, గోవాలపై ఫుల్ ఫోకస్..
ప్రత్యేకించి- పంజాబ్, గోవాపై దృష్టి సారించింది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి శ్రమిస్తోంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను పన్నుతోంది. ఢిల్లీకి ఆనుకుని ఉన్న పంజాబ్‌లో అధికారంలోకి వస్తామనే ధీమా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌లో కనిపిస్తోంది.

వ్యాట్ తగ్గింపు..
దీనికి అనుగుణంగా ఆయన తన ఎన్నికల వ్యూహాలను పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా- ఢిల్లీలో పెట్రోల్ రేటును భారీగా తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం కంటే కూడా ఢిల్లీ తగ్గించిన రేటు అధికం. పెట్రోల్‌పై లీటర్ ఒక్కింటికి ఎనిమిది రూపాయల మేర తగ్గించారు కేజ్రీవాల్. పెట్రోల్ అమ్మకాలపై విధించిన విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 19.40 శాతానికి తగ్గించారు. ఫలితంగా- పెట్రోల్ రేటు ఎనిమిది రూపాయల మేర తగ్గుతుంది.

ఈ అర్ధరాత్రి నుంచే అమలు..
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీ మంత్రివర్గం ఈ ఉదయం సమావేశమైంది. ఈ సందర్భంగా పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని మంత్రివర్గం తీర్మానించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఇదివరకు 30 శాతం వరకు పెట్రోల్ అమ్మకాలపై వ్యాట్‌ను వసూలు చేస్తుండేది కేజ్రీవాల్ సర్కార్. దీన్ని 19.40 శాతానికి కుదించింది. తగ్గించిన పెట్రోలు ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని కేజ్రీవాల్ ప్రకటించారు.

కేంద్రం కంటే ఎక్కువగా..
దీపావళి పండగను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర కస్టమ్స్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే. తదనంతరం.. పలు రాష్ట్రాలు కేంద్రాన్ని అనుసరించాయి. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్ అమ్మకాలపై వ్యాట్‌ను తగ్గించాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్, రాజస్థాన్ కూడా పెట్రోల్‌పై భారాన్ని కొంతమేర కుదించాయి.

ఎన్నికల కోసమేనా?
ఇప్పుడు తాజాగా అదే జాబితాలో ఢిల్లీ ప్రభుత్వం చేరింది. పెట్రోల‌్‌పై లీటర్ ఒక్కింటికి ఎనిమిది రూపాయలు తగ్గేలా వ్యాట్‌ను సవరించింది. వచ్చే ఏడాది జరగబోయే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆయా రాష్ట్రాల్లో పోటీ చేస్తోండటాన్ని పరిగణనలోకి తీసుకుని.. అక్కడి ఓటర్లకు ఓ సానుకూల సందేశాన్ని అరవింద్ కేజ్రీవాల్ పంపించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వచ్చేవారం కేజ్రీవాల్ పంజాబ్‌లో పర్యటిస్తారని, ఎన్నికలపై కసరత్తు చేస్తారని చెబుతున్నారు.

పంజాబ్ కోసం తొలి జాబితా కూడా..
కాగా- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ ఇదివరకే ప్రకటించింది కూడా. ఈ విషయంలో అన్ని పార్టీల కంటే ముందంజలో ఉంది. సుదీర్ఘకాలం పాటు పోరాటాన్ని సాగించిన రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ. ఫలితంగా పంజాబ్ రైతుల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోగలిగింది. దీనికి అనుగుణంగా పెట్రోల్ రేట్లను తగ్గించడం వల్ల ఈ వాతావరణం మరింత మెరుగుపడుతుందని అంచనా వేస్తోంది.












Click it and Unblock the Notifications