Viral Video: రైల్వే స్టేషన్లలో లక్షల మంది.. ఒక్క పరీక్ష కోసం..
ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం ఎంత మేరకు ఉందో ఈ దృశ్యాలు చూస్తుంటే అర్థం అవుతోంది. రైల్వే స్టేషన్లలో ఇసుకేస్తే రాలనంతమంది యువత తరలివస్తున్నారు. ఒక్క పరీక్ష కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసేందుకు రాష్ట్రంలోని నలు మూలల నుంచి తరలివస్తున్నారు. దాంతో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ కిక్కిరిసిపోయాయి. ఓ వైపు తాము సరైన సమయానికి ఎగ్జామినేషన్ సెంటర్ కు చేరుకుంటామా..? లేదా..? మరోవైపు ఈ సారి కూడా పేపర్ లీక్ అవుతుందా..? అన్న భయాలతో యువత ఆందోళన చెందుతున్నారు. ఇదిలాఉంటే రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న యువత కోసం రైల్వే స్టేషన్లలో కనీస రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైనట్లుగా చెప్పొచ్చు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది.
ఉత్తరప్రదేశ్ లో చాలా ఏళ్ల తర్వాత పోలీస్ నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 32,679 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ వచ్చింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 28.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక్కో పోస్టుకు 88 మంది పోటీ పడుతుండటం నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతోందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పరీక్షల కోసం అభ్యర్థులు ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్, వారణాసి, కాన్ పూర్, ఆగ్రా, జౌన్ పూర్ తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీ భారీగా నెలకొంది. ప్లాట్ ఫారమ్ లు, రైళ్లు యువతతో నిండిపోయాయి. చాలామంది అభ్యర్థులు రైళ్ల కోసం గంటల తరబడి ఎండలో వేచి చూడలేక.. అక్కడే దుప్పట్లు వేసుకుని నిద్రిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు తగిన రవాణా ఏర్పాట్లు లేకపోవడంతో సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
Massive rush at Charbagh Railway Station after the UP Police Constable Exam 2026. Overcrowded trains and packed platforms created travel challenges for passengers and candidates alike. #UPPoliceExam2026 #Lucknow pic.twitter.com/GNi6D3T4Vr
— NDTV Education (@ndtveducation) June 9, 2026
ఓవైపు ఎండల తీవ్రత, రవాణా సౌకర్యాలు లేకపోవడం అలాగే తమ కుటుంబాల కష్టాలు, పేపర్ లీక్ ఘటనలతో యువత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ అభ్యర్థి మాట్లాడుతూ.. మా నాన్న ఓ రైతు. ఎంతో కష్టపడి నన్ను చదివించి.. కోచింగ్ ఇప్పించారు. ఈసారి ఎలాగైనా పరీక్ష సరిగ్గా జరగాలి. పేపర్ లీక్ కాకూడదని కోరుకుంటున్నాం అని అన్నాడు. ఇక రాష్ట్రంలో నెలకొన్న ఈ సమస్యపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ.. అధికార బీజేపీపై విమర్శలు గుప్పించింది. అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదని ఆరోపిస్తోంది. భారీ రద్దీ కారణంగా అభ్యర్థులు రైలు కిటికీల గుండా లోపలికి దూరి ప్రయాణించాల్సి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయని మండిపడింది.












Click it and Unblock the Notifications