పాకిస్థాన్ కు చుక్క నీరు కూడా ఇవ్వం: భారత్ మరోసారి సంచలనం
భారత్- పాకిస్థాన్ మధ్య ఏళ్లుగా సాగుతున్న ఉద్రిక్తతలు గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా రెట్టింపయ్యాయి. గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఈ దాడుల వెనుక ఉన్నట్లు గ్రహించిన భారత్.. మే 7 నుంచి 10 మధ్య ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లో 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. వందలాదిమంది ఉగ్రవాదులను హతమార్చింది. అయితే కేవలం పాకిస్థాన్ పై దాడులే కాకుండా దౌత్య పరంగా, ఆర్థిక పరంగా అత్యంత కఠినమైన వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకుంది.
అయితే భారత్ తీసుకున్న నిర్ణయాల్లో 1960 నాటి సింధూ నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం అత్యంత ప్రధానమైనది. రక్తం.. నీరు.. కలిసి ప్రవహించలేవు అని భారత్ క్లియర్ గా స్పష్టం చేసింది. అయితే తాజాగా ఇదే వివాదంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో పాకిస్థాన్ కు సింధూ నది వ్యవస్థ నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా ప్రధాని మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అయితే 1960 నాటి ఈ ఒప్పందం పూర్తిగా రద్దు చేయలేదని.. ప్రస్తుతం దానిని తాత్కాలిక నిలిపివేతలో ఉంచినట్లు స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దుల్ని దాటి పాకిస్థాన్ కు వెళ్లే నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి టైమ్ బౌండ్ పద్ధతిలో పనులు వేగంగా జరుగుతున్నాయని.. రాబోయే సంవత్సరాల్లో ఒక్క చుక్క నీరు కూడా పాకిస్థాన్ కు వెళ్లదని మంత్రి సీఆర్ పాటిల్ పేర్కొన్నారు. ఇక ఇదే విషయంపై తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం కింద ఏర్పాటైన ఆర్బిట్రేషన్ కోర్టు అధికార పరిధిని భారత్ తోసిపుచ్చింది. అది చట్టవిరుద్ధంగా ఏర్పడిన కోర్టు అని.. ఆ కోర్టు తీర్పులను భారత్ గుర్తించదని పేర్కొన్నారు. ఈ మేరకు కిషన్ గంగ, రాట్లే హైడ్రో పవర్ ప్రాజెక్టుల విషయంలో పాకిస్థాన్ అభ్యంతరాలను భారత్ అంగీకరించడం లేదని పేర్కొన్నారు.

ఇక భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్థాన్ లో నీటి సంక్షోభం తలెత్తింది. ఆ దేశంలో నీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీ నగరంలో ఇప్పటికే తీవ్రమైన నీటి కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. నగరంలోని దాదాపు 70 శాతం ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దాంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications