అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి భీకర యుద్ధం.. శాంతి ఒప్పందానికి తూట్లు..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ఉద్ధృతంగా మారాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి నియంత్రణ విషయంలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రణరంగం మొదలైంది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ అమెరికా సైన్యం దాదాపు పది ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేసింది. దీనికి ప్రతికారంగా కువైట్, బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురు, సహజ వాయువుల్లో ఐదో వంతు ఈ హార్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతాయి. ఈ నేపథ్యంలో, ఈ మార్గంపై తమకే పూర్తి నియంత్రణ ఉండాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఓడలు తమ తీరానికి సమీపంగా ప్రయాణించాలని నిర్దేశిస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా నౌకాదళం పర్యవేక్షణలో ఓమన్ తీరానికి సమీపంలో కొత్త ప్రత్యామ్నాయ మార్గాన్ని సిద్ధం చేయడం ఇరాన్‌కు ఆగ్రహం కలిగిస్తోంది.
శాంతి ఒప్పందానికి పొంచి ఉన్న ముప్పు
ఇరాన్ నిర్దేశించిన మార్గాన్ని కాదని కొత్త ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. ఇది జలసంధి పునఃప్రారంభాన్ని మరింత ఆలస్యం చేయడమే కాకుండా ఉద్రిక్తతలను పెంచుతుందన్నారు. తాజా దాడుల పరంపర అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ప్రమాదంలో పడేసింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు ఆంక్షల ఎత్తివేత, నౌకల రాకపోకలపై చర్చలు జరపాల్సి ఉంది.
అమెరికాకు ఆశ్రయమిస్తున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. తమపై జరిగిన దాడులను కువైట్, బహ్రెయిన్ తీవ్రంగా ఖండించాయి. అమెరికా సైనిక స్థావరం ఉన్న కువైట్ రెండు బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంది. మరోవైపు, అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో ఫ్లీట్ ఉన్న బహ్రెయిన్‌లో ఒక నివాస భవనం ఈ దాడుల్లో పాక్షికంగా ధ్వంసమైంది. ఈ ఉద్రిక్తతలు ప్రాంతీయ శాంతికి పెద్ద సవాలుగా మారాయి.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరికలు.. అమెరికా వ్యూహాత్మక ప్రతిదాడుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి వివాదం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు దౌత్య పరమైన చర్చలు సాగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాడులు ఈ ప్రక్రియను దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ దేశాల ఇంధన భద్రతతో ముడిపడి ఉన్న ఈ జలసంధిలో శాంతి నెలకొనకపోతే గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications