ఆక్సిజన్ కోసం నిరీక్షించమని మీరు కరోనా రోగులకు చెప్తారా? .. కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో ఆక్సిజన్ కొరత ఉందని, ఢిల్లీ కి రావలసిన ఆక్సిజన్ కోటాను తగ్గించి ఇతర రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేస్తుందని సాక్షాత్తు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రం పై విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపించింది.
ఆక్సిజన్ సరఫరా మరియు వ్యాక్సిన్ ల పంపిణీ విధానంపై హైకోర్టు కేంద్ర విధానాన్ని తప్పు పట్టింది.

అవసరానికి తగ్గట్టు వైద్య వనరులు అందించకపోతే మీ చేతులకే ఆ పాపం : ఢిల్లీ హైకోర్టు
ఆక్సిజన్ కోసం ఎదురుచూడమని మీరు కరోనా రోగులకు చెప్తారా ఏంటి అంటూ కేంద్రం తీరుపై ఢిల్లీ హైకోర్టు మండిపడింది. కరోనా మహమ్మారిని నియంత్రించే వైద్య వనరులను అందించడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపణలు చేసిన తర్వాత హైకోర్టు కేంద్రాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. అవసరమైన ప్రదేశాలకు మందులు పంపించకపోతే, కరోనా బాధితులు చనిపోతే దానికి బాధ్యత కేంద్రానిది కాదా, వారి చేతులకే రక్తం అంటుకుంటుంది కదా అని ప్రశ్నించింది.

ఆక్సిజన్ ను పరిశ్రమల నుండి మళ్లించలేరా : ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
దేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో ఒకటి అయిన ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా తగ్గించి, ఇతర ప్రాంతాలకు సరఫరా మళ్లించబడుతోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తున్న వేళ కోవిడ్ రోగులకు తగినంత ఆక్సిజన్ సరఫరా చేయబడటం లేదని హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది . ఆక్సిజన్ ను పరిశ్రమల నుండి మళ్లించలేరా అని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు మానవ జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని, పరిశ్రమలు ఆక్సిజన్ అవసరం కోసం కొంత కాలం వేచి ఉండొచ్చని, కానీ మనుషులు , కరోనా రోగులు అలా వేచి ఉండలేరని ధర్మాసనం కేంద్రానికి తెలిపింది.

ఏప్రిల్ 22 నుండి పరిశ్రమలకు ఆక్సిజన్ నిషేధం అన్న కేంద్రం .. 22 కోసం ఎందుకు వేచి ఉండాలని హైకోర్టు ప్రశ్న
కొరత కారణంగా కోవిడ్ రోగులకు ఇవ్వబడుతున్న ఆక్సిజన్‌ను తగ్గించాలని గంగా రామ్ ఆసుపత్రి వైద్యులు బలవంతం చేస్తున్నారని విన్నట్లు న్యాయమూర్తులు ఈ సందర్భంగా ఉటంకించారు . ఏప్రిల్ 22 (గురువారం) నుండి పారిశ్రామిక ఉపయోగం కోసం ఆక్సిజన్ నిషేధించబడిందని కేంద్రం కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది . అయితే ప్రస్తుత ప్రమాదకర పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు నుండి ఎందుకు చేయకూడదు? అని ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు. ఏప్రిల్ 22 కోసం ఎందుకు వేచి ఉండాలని కేంద్రాన్ని అడిగింది.

ఢిల్లీ అవసరానికంటే ఎక్కువగానే ఆక్సిజన్ సరఫరా ఇస్తున్నామన్న కేంద్రం .. కోర్టులో వాదనలు
మూడు శాతం మంది రోగులకు మాత్రమే ఐసియు పడకలు అవసరమని, ఐసియు రోగులకు 24 లీటర్ల ఆక్సిజన్ అవసరమని, ఐసియు కాని పడకలకు 10 లీటర్ల ఆక్సిజన్ అవసరమని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. 80 శాతం కేసులు తేలికపాటివని , 17 శాతం కాస్త ఆందోళనకరంగా ఉన్నాయని, మూడు శాతం మందికి మాత్రమే ఐసియు సంరక్షణ అవసరం అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీకి 378 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇవ్వగా, 700 మెట్రిక్ టన్నులను ఢిల్లీ ప్రభుత్వం కోరింది. 74,941 కేసులకు 220 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం. కాని తాము 378 మెట్రిక్ టన్నులు కేటాయించామని , ఢిల్లీకి అదనంగానే ఆక్సిజన్ ఇచ్చామని కేంద్రం వాదించింది.












Click it and Unblock the Notifications