శభాష్ "ఢిల్లీ పోలీస్".. ఒక్క రాత్రిలోనే 285 మంది అరెస్ట్!
నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. సౌత్-ఈస్ట్ జిల్లా పోలీసులు చేపట్టిన ఈ 'ఆపరేషన్ ఆఘాత్ 3.0' కింద శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా యాక్షన్ షురూ చేశారు. శుక్రవారం రాత్రి మెరుపు దాడులు చేసి వందలాది మందిని అరెస్టు చేయడంతో పాటు, పలువురిని ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు.
కాగా మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. సౌత్-ఈస్ట్ డీసీపీ హేమంత్ తివారీ ఈ ఆపరేషన్ గురించి కీలక విషయాలు తెలిపారు. ఎక్సైజ్, ఎన్డీపీఎస్, గ్యాంబ్లింగ్ చట్టాల కింద మొత్తం 285 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా 504 మందిని అదుపులోకి తీసుకున్నామని.. నేర చరిత్ర కలిగిన మరో 116 మందిని కూడా గుర్తించి పట్టుకున్నామని వివరించారు.

ఈ ఆపరేషన్‌లో భారీ ఎత్తున నేరస్తులను పట్టుకోవడంతో పాటు, పలు అక్రమ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తివారీ స్పష్టం చేశారు. 10 మంది ప్రాపర్టీ అఫెండర్లు, ఐదుగురు ఆటో-లిఫ్టర్లను అరెస్ట్ చేసి.. వారి నుంచి 21 నాటు తుపాకులు, 20 బుల్లెట్లు, 27 కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలానే సుమారు 12,258 క్వార్టర్ల అక్రమ మద్యం, 6.01 కిలోల గంజాయిని సీజ్ చేసినట్టు వెల్లడించారు. జూదగాళ్ల నుంచి రూ.2,30,990 నగదు, 310 మొబైల్ ఫోన్లు, 231 ద్విచక్ర వాహనాలు, ఒక ఫోర్-వీలర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
మరోవైపు నూతన సంవత్సర వేడుకల వేళ ప్రజా భద్రతకు భంగం కలగకుండా, నేరాలను ముందుగానే నిరోధించే లక్ష్యంతో ఈ ఆపరేషన్ జరిగిందని పోలీసు అధికారులు వివరించారు. జిల్లాలోని నేర ప్రభావిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని, స్థానిక నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు రాత్రంతా ఏకకాలంలో దాడులు, వాహన తనిఖీలు చేపట్టారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications