52.3 డిగ్రీల ఎండ: మలమల మాడిపోయిన జనం
Delhi temperature: ఈ ఏడాది ఎండా కాలం పోతూ పోతూ కొన్ని పాత రికార్డులను తిరగేస్తోంది. చివరి దశలో ఎండ అత్యంత ప్రచండంగా కాస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉష్ణోగ్రత నమోదవుతోంది. మాడు పగిలే ఎండ, వేడి గాలులతో జనం ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు.
ఈ సీజన్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత దేశ రాజధానిలో రికార్డయింది. ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని ముంగేష్‌పూర్‌లో నేడు గరిష్ఠంగా 52.3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ వాయవ్య ప్రాంతంలో హర్యానా రాష్ట్ర సరిహద్దులకు ఆనుకుని ఉంటుంది ముంగేష్‌పూర్.

భారత వాతావరణ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్.. దీన్ని నమోదు చేసింది. ముంగేష్‌పూర్ జవహర్ నవోదయ విద్యాలయ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఇక్కడ 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెదర్ స్టేషన్ సిబ్బంది, వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
దేశంలో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాలేదు. 2016లో రాజస్థాన్‌లోని ఫలౌదీలో అత్యధికంగా 51 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రెండు రోజుల కిందట అదే రాజస్థాన్‌లోని చురూ ప్రాంతంలో 50.8 డిగ్రీల మేర ఎండ కాసింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం అనుకుంటున్న దశలో 52.3 డిగ్రీల మేర ఎండ తీవ్రత నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కాగా- నైరుతి రుతుపవనాలు గడువు కంటే ముందే కేరళ తీరాన్ని తాకనున్నాయి. వచ్చే 24 గంటల వ్యవధిలో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంచనా వేసిన దానికంటే ముందే అవి కేరళ వద్ద తీరాన్ని తాకనున్నట్లు తెలిపింది. దీనికి అనుగుణంగా కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి కూడా.












Click it and Unblock the Notifications