ఐబీ స్కూల్స్ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో టాప్ 9స్థానంలో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్!
ముంబైలోని ప్రఖ్యాత 'ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్' (DAIS) కేవలం సెలబ్రిటీల పిల్లలు చదువుకునే లగ్జరీ పాఠశాల మాత్రమే కాదు, ఇదొక వినూత్న ప్రయోగాత్మక విద్యా కేంద్రం. ఈ పాఠశాల ఏర్పాటు వెనుక ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. నీతా అంబానీ తన పిల్లలైన ఆకాశ్, ఈశా చిన్నతనంలో పాఠశాల వాతావరణంపై చేసిన సరదా వ్యాఖ్యల ద్వారా ఈ ఆలోచనకు బీజం పడింది.
గంటల తరబడి తరగతి గదుల్లో కూర్చోవడం బోర్ కొడుతోందని పిల్లలు చెప్పినప్పుడు, అలాగే చిన్న కుమారుడు అనంత్ అంబానీ పాకెట్ మనీ గురించి చెప్పిన విషయాలు నీతా అంబానీని ఆలోచింపజేశాయి. విద్యార్థులకు బోరు కొట్టని విధంగా, కేవలం బట్టీ పద్ధతి కాకుండా ఆచరణాత్మక జ్ఞానాన్ని అందించే, డబ్బు విలువను నేర్పించే ఒక అద్భుతమైన పాఠశాలను ప్రారంభించాలని ఆమె నిర్ణయించుకున్నారు. అలా 2003లో ఈ విద్యాసంస్థ రూపుదిద్దుకుంది.

ఈ పాఠశాలలో కేవలం చదువు మాత్రమే కాకుండా సమాజం పట్ల బాధ్యతను కూడా నేర్పుతారు. 'ఇంటర్నేషనల్ బ్యాకలారియేట్' (IB) విధానంలో నడిచే ఈ స్కూల్ విద్యార్థులు తరగతి గదులకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పనులు చేయాల్సి ఉంటుంది. 2009 నుంచి 'విలేజ్ ప్రాజెక్ట్' కింద మహారాష్ట్రలోని మారుమూల గిరిజన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అంబానీ కుటుంబసభ్యులు, సెలబ్రిటీల పిల్లలు సైతం స్వయంగా గ్రామాల్లో సిమెంట్ పనులు చేయడం, ఇళ్లు కట్టడం, గిరిజన పిల్లలకు పాఠాలు చెప్పడం వంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు.
ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో 6000 ఐబీ స్కూళ్లు ఉన్నాయి. లండన్‌కి చెందిన 'ఎడ్యుకేషన్ అడ్వైజర్స్' సంస్థ వాటిల్లో టాప్-10 స్కూళ్లని ఎంపికచేసి ప్రతి సంవత్సరం ర్యాంకులు ప్రకటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది ఐబీ స్కూళ్లలో ఈ పాఠశాల టాప్-10లో ఉంది. ప్రస్తుతం గ్లోబల్ ర్యాంకింగ్ లో 9వ స్థానంలో నిలిచి, ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక పాఠశాలగా రికార్డు సృష్టించింది.
ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా వంటి పారిశ్రామిక దిగ్గజాలు ఇక్కడ విద్యార్థులకు ప్రత్యక్షంగా వ్యాపార పాఠాలు బోధిస్తారు. ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ ఆధ్వర్యంలో పౌష్టికాహారం, మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన యూనిఫామ్స్, మరియు సౌకర్యవంతమైన మోడ్రన్ ఫర్నిచర్ ఇక్కడి ప్రత్యేకతలు. తరగతిలో ప్రతి ఆరుగురు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటారు. విద్యార్థులు అభ్యసిస్తున్న తరగతులను బట్టి సంవత్సరానికి రూ.1.70 లక్షల నుంచి రూ.13.42 లక్షల వరకు ఫీజు ఉంటుంది.












Click it and Unblock the Notifications
