వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లగడపాటి జట్టు 'వార్': మాపని మేం చేస్తామన్న డిగ్గీ

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదానికి సహకరించాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను కోరారు. అయితే, లగడపాటి రాజగోపాల్, మరికొంత మంది అందుకు నిరాకరించారు. దాంతో తమ పని తాము చేసుకుపోతాం, తర్వాత మీ ఇష్టమని దిగ్విజయ్ సింగ్ అన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి వార్ రూమ్‌లో ఇరు ప్రాంతాల పార్లమెంటు సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశం వేడిగా, వాడిగా సాగింది.

ఇరు ప్రాంతాల పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులతో వార్ రూమ్‌లో దిగ్విజయ్ సింగ్‌తో పాటు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, జివోఎం సభ్యుడు జైరాం రమేష్ పాల్గొన్నారు. సమావేశానికి దిగ్విజయ్ సింగ్ తిరుగుబాటు పార్లమెంటు సభ్యులను కూడా ఆహ్వానించారు. ఆ ఆరుగురు పార్లమెంటు సభ్యుల్లో ముగ్గురు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివ రావు, హర్షకుమార్ సమావేశానికి హాజరు కాగా, మరో ముగ్గురు సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్ హాజరు కాలేదు.

కాగా, వార్ రూం సమావేశం నుంచి రాయపాటి సాంబశివ రావు మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు. లగడపాటి రాజగోపాల్ మాత్రం తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ఒక్క నిమిషం కూడా పార్లమెంటును జరగనివ్వమని లగడపాటి రాజగోపాల్ అన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు తమతో కలిసి రావాలని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సహకరించబోమని లగడపాటి రాజగోపాల్‌తో పాటు హర్షకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే, తెలంగాణపై తాము వెనక్కి తగ్గబోమని దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, సమావేశానంతరం దిగ్విజయ్ సింగ్ మీడియా ప్రతినిధులతో క్లుప్తంగా మాట్లాడారు. మంచి సమావేశం జరిగిందని, అభిప్రాయాలు పంచుకున్నామని ఆయన చెప్పారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు వ్యక్తం చేసిన ఆక్షేపణలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాలవారు గెలిచే విధంగా బిల్లు ఉందని చెప్పారు. అంతకు మించి మాట్లాడడానికి ఆయన ఇష్టపడలేదు.

Digvijay Singh

వార్ రూం సమావేశంలో మాత్రం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు గట్టిగానే సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రేపు బుధవారం ముఖ్యమంత్రి చేపట్టే ధర్నాకు హాజరు కాకూడదని ఆయన సీమాంధ్ర ఎంపిలకు సూచించారు. తెలంగాణ అంశాన్ని మానిఫెస్టోలో చేర్చామని, అందుకే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. సభకు ఆటంకం కలిగించవద్దని ఆయన సూచించారు. అయితే, కొంత మంది సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అందుకు అంగీకరించలేదు.

ఇతర ప్రాంతాలకూ న్యాయం జరిగేలా చూస్తామని అధిష్టానం నాయకులు చెప్పినట్లు సమావేశానంతరం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు చెప్పారు. కొంత మంది అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారని ఆయన అన్నారు. కాంగ్రెసు రక్తం ప్రవహిస్తున్నవారు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఆయన అన్నారు. దిగ్విజయ్ సింగ్ సూచన మేరకు తెలంగాణ నేతలు దీక్షల ఆలోచనను విరమించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి దీక్షకు పోటీగా దీక్ష చేయాలని తెలంగాణ నేతలు ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్లమెంటు సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బిల్లు ఆమోదానికి సహకరించాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీమాంధ్ర ఎంపీలను కోరారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో సీమాంధ్రకు న్యాయం చేయకుండా ముందుకు వెళ్తే సమస్యలు వస్తాయని చెప్పినట్లు సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి జెడి శీలం చెప్పారు. ఇరు ప్రాంతాల సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడించి మంచి పని చేశారని ఆయన అన్నారు. హైదరాబాద్, భద్రాచలం, పోలవరం తదితర సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.

English summary
Lagadapati Rajagopal and few other Seemandhra MPs rejected to cooperate with high command on Telangana bill in the parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X