ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ 63 శాతానికి పెంచుతూ సీఎం కీలక ప్రకటన
దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందింది. ఉద్యోగులకు డీఏ (కరవు భత్యం)ను 63 శాతానికి పెంచుతూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జూలై 2026 నుంచి అమల్లోకి వస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ స్పష్టం చేశారు. ఇక పెరిగిన డీఏ ను నవంబర్ జీతంతో కలిపి అందించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా రిలీఫ్ లభించింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం.. సవరించిన ఈ డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎయిడెడ్ ఎడ్యూకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ లోని ఉద్యోగులు, టెక్నికల్ ఎడ్యూకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ లోని ఉద్యోగులు అలాగే అర్బన్ లోకల్ బాడీస్ లోని ఉద్యోగులకు వర్తించనుంది.
ఇక జూలై నుంచి అక్టోబర్ 2026 వరకు ఉన్న బకాయిలను ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 60 శాతం ఉన్న డీఏ ను రాష్ట్ర ప్రభుత్వం 3 శాతం పెంచడంతో ప్రస్తుతం మొత్తం 63 శాతానికి చేరింది. పెంచిన డీఏ నవంబర్ జీతంతో కలిపి ఉద్యోగుల ఖాతాల్లో జమ కానుంది. దీపావళి పండగ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో లక్షలాది మంది ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనకు ముందు రాష్ట్రంలో నూతనంగా ఎంపికైన 4,543 మంది సబ్ ఇన్పెక్టర్లకు లక్నోలో నియామక పత్రాలను అందజేశారు. మిషన్ రోజ్ గార్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను యూపీ పోలీస్ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్టు చేసింది.

ఇక ఉత్తర్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి నెలల్లో జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 403 స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే రెండు సార్లు అధికార బీజేపీ ఇక్కడ అధికారంలో ఉంది. ఈ క్రమంలో వరుసగా హ్యాట్రిక్ విక్టరీ కొట్టి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని యోగీ ఆదిత్యనాథ్ ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే గతంలో కంటే ఈసారి ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది.












Click it and Unblock the Notifications
