ఐఏఎస్ రవిది ఆత్మహత్య: హైకోర్టుకు చెప్పిన ప్రభుత్వం
బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో మద్యంతర నివేదికను ఎలా బహింరంగపరుస్తారని కర్ణాటక హైకోర్టు ప్రశ్నించింది. ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పద మృతి కేసులో సీఐడి అధికారులు సమర్పించిన మద్యంతర నివేదికను బహింరంగం చెయ్యరాదని మహిళ ఐఏఎస్ అధికారి భర్త కర్ణాటక హైకోర్టులో రిట్ వేసిన విషయం తెలిసిందే.
సోమవారం మద్యాహ్నం హైకోర్టు ఏకసభ్య బెంచ్ రిట్ విచారణ చేపట్టింది. ఆ సమయంలో న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ ప్రభుత్వానికి, అడ్వకేట్ జనరల్ కు పలు ప్రశ్నలు వేశారు. ఐఏఎస్ అధికారి డి.కే రవి ఎలా మరణించారని కేసు నమోదు చేశారు, దర్యాప్తు పూర్తి అయ్యిందా అని ప్రశ్నించారు.

దర్యాప్తు చేస్తున్న సీఐడి అధికారులు తయారు చేసిన నివేదిక ఏలా ఉందని అడిగారు. దర్యాప్తు జరుగుతున్న సమయంలో కేసు వివరాలను శాసన సభ సమావేశాలలో బహిరంగ పరిచి ఎలా చర్చ జరుపుతారని ప్రశ్నించారు. మద్యంతర నివేదిక తప్పుల తడక అని చివరిలో తెలిస్తే అందులో పేర్లు ఉన్న వారికి అవమానం కాదా, తరువాత వారికి ఏమి సమాదానం చెబుతారని న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ అన్నారు.
ఈ సందర్బంలో అడ్వకేట్ జనరల్ రవివర్మ కుమార్ సీఐడి అధికారులు సమర్పించిన మధ్యంతర నివేదికను సీల్డ్ కవర్ లో న్యాయమూర్తికి అందించారు. రవి ఆత్మహత్య చేసుకున్నారని పోస్టుమార్టుం నివేదికలో వెలుగు చూసిందని హైకోర్టుకు తెలిపారు. రవి కేసు విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తన్నాయని, వాటిని ఎదుర్కోవడానికి మద్యంతర నివేదిక బయట పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని సమాధానం ఇచ్చారు. ఇప్పటికే మహిళ ఐఏఎస్ అధికారిని సీఐడి అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారని న్యాయమూర్తికి చెప్పారు.
ఎదైనా కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో మద్యంతర నివేదిక బయట పెట్టరాదని సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిందని న్యాయస్థానం గుర్తు చేసింది. మద్యంతర నివేదిక బయటపెట్టరాదని కర్ణాటక హైకోర్టు సూచించింది. రిట్ విచారణ మంగళవారంకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications