ఒకే వైద్యుడు-7 గంటల్లో 101 మంది మహిళలకు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ-విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు ఏడు గంటల్లోనే ఏకంగా 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు,ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా ఒక వైద్యుడు ఒకేరోజు ఇన్ని ఆపరేషన్లు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై విచారణకు ఆదేశించింది.
సుర్గుజా జిల్లాలోని మైన్‌పట్‌లో ఉన్న నర్మదాపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఆగస్టు 27,2021న ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు జరిగిన ఈ క్యాంపులో ప్రభుత్వ వైద్యుడు డా.జిబ్నస్ ఎక్కా ఏకంగా 101 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ చేయించుకున్న మహిళల ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ... నిబంధనలకు విరుద్దంగా ఒకే వైద్యుడు ఇన్ని ఆపరేషన్లు చేయడంపై వైద్య శాఖకు ఫిర్యాదులు అందాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం...ఒకరోజులో ఒక వైద్యుడు కేవలం 30 ఆపరేషన్లు మాత్రమే చేయాలి. ఇక్కడ అంతకు మూడు రెట్లు ఆపరేషన్లు ఒకే వైద్యుడు నిర్వహించాడు. ఈ వివాదంపై డా.జిబ్నస్ స్పందిస్తూ... ప్రభుత్వ నిబంధనలు తనకు తెలుసన్నారు. అయితే ఆరోజు క్యాంపుకు ఎక్కడెక్కడి నుంచో చాలామంది మహిళలు తరలివచ్చారని చెప్పారు. తాము సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని... మళ్లీ మళ్లీ రావడం తమకు వీలు కాదని... ఎలాగైనా ఈరోజే ఆపరేషన్ చేయాలని వారు తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. అందువల్లే అన్ని ఆపరేషన్లు చేయాల్సి వచ్చిందన్నారు.
ఈ వివాదానికి సంబంధించి వైద్యుడికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని జిల్లా వైద్యాధికారి పి సిసోడియా తెలిపారు. దీనిపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు కూడా ఆదేశించామన్నారు.కమిటీ నివేదికను బట్టి చర్యలు ఉంటాయన్నారు.
గతంలో 2014లో ఇదే ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించగా...ఆపరేషన్ చేయించుకున్న 83 మంది మహిళలు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 13 మంది చనిపోయారు. దీనిపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది. ప్రభుత్వం ఉచితంగా నిర్వహించే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై ఈ ఘటన ఒక మచ్చలా మిగిలిపోయింది. అప్పటినుంచి ప్రభుత్వం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాల నిర్వహణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.












Click it and Unblock the Notifications