దొడ్ల పాలలో డిటర్జెంట్.. ప్రియగోల్డ్ బిస్కెట్లలో పశువుల దాణా.. FSSAI అధికారులు కేసులు నమోదు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆహారంలో కల్తీ విజృంభిస్తోంది. దాదాపు అన్ని ఆహార పదార్థాల్లోనూ కల్తీ తాండవం చేస్తోంది. సొంత లాభాల కోసం కొంతమంది ఆహార ఉత్పత్తులను కల్తీమయం చేస్తున్నారు. అయితే పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలే వీటికి కేంద్రాలుగా మారుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. కల్తీ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) అధికారులు ఉక్కుపాదం మోపినా ఇలాంటి చర్యలు ఆగడం లేదు. తాజాగా కల్తీ ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్న మూడు కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ప్రియ గోల్డ్ బిస్కెట్ల తయారీలో పశువుల దాణా ఊకను వాడటం అలాగే ప్రముఖ డైరీ ఉత్పత్తుల సంస్థ అయిన దొడ్ల డెయిరీ పాలలో డిటర్జెంట్, కాస్టిక్ సోడా ఆనవాళ్లు బయటపడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు వీటిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి చర్యలు చేపట్టారు.
సూర్య ఫుడ్ అండ్ అగ్రో సంస్థ ప్రియగోల్డ్ బిస్కెట్లను తయారు చేస్తుంది. అయితే ఈ బిస్కెట్ల తయారీలో వాడే రా మెటీరియల్ లో పశువుల దాణాను వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ గోనె సంచులపై పశువుల దాణా అని స్పష్టంగా ముద్రించి ఉన్నట్లు తేలింది. అలాగే ఈ తనిఖీల్లో ఫ్యాక్టరీలో తీవ్రమైన పరిశుభ్రతా లోపాలు కూడా బయటపడ్డాయి. భారీ లోపాల కారణంగా గతంలోనే కంపెనీ లైసెన్స్ ను సస్పెండ్ చేసిన అధికారులు.. ఇప్పుడు నేరుగా కోర్టులో ప్రాసిక్యూషన్ కు సిద్ధమైనట్లు సమాచారం.

మరోవైపు ప్రముఖ డైరీ ఉత్పత్తుల సంస్థ దొడ్ల డెయిరీ కి చెందిన ఫుల్ క్రీమ్ పాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించగా అవి నాణ్యతాపరమైన నిబంధనలను అందుకోలేదని తేల్చారు. అయితే కంపెనీ అప్పీల్ చేయడంతో ఆ ఆహార పదార్థాల నమూనాలను ప్రతిష్టాత్మక రిఫరల్ ఫుడ్ లాబొరేటరీకి పంపించారు. అయితే అక్కడి ఫలితాల్లో దొడ్ల పాలలో డిటర్జెంట్, కాస్టిక్ సోడా ఉన్నట్లు తేలింది. దీంతో దొడ్ల సంస్థపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. వీటితోపాటు UEIR Organic Foods విక్రయిస్తున్న ఎల్లో కిస్మిస్ లోనూ ప్రమాదకరమైన పురుగుల మందుల అవశేషాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
