ఛాతీ కొలతలపై వ్యాఖ్యలు: అసహనం, మంత్రులకు క్లాస్ పీకిన మోడీ
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ గురించి అతిగా మాట్లాడటం, గొప్పలు చెప్పుకోవడం చేయొద్దని మంత్రులకు ప్రధాని మోడీ సూచించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహరాల క్యాబినెట్ కమిటీ భేటీలో ప్రధాని మోడీ ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది.
దాడులపై మంత్రులకు కొన్ని సూచనలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడుల తర్వాత ప్రధాని మోడీ ఛాతీ 100 అంగుళాలకు పెరిగిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించడాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. దాడులకు సంబంధించి ఇష్టానుసారం మాట్లాడుతున్న పలువురు కేంద్ర మంత్రులపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు.

సర్జికల్ స్ట్రయిక్స్‌పై కేవలం అనుమతి ఉన్న వ్యక్తులే ఈ దాడులపై స్పందించాలని ఆయన స్పష్టంచేశారు. కాగా సర్జికల్ దాడుల వీడియోలు విడుదల చేయాలంటూ ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ సహా మరికొన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో అసలు వీడియోలను విడుదల చేయాలా? వద్దా? అనేదానిపై ఈ భేటీలో చర్చించారు.
వీడియో ఫుటేజ్ సైన్యానికి సంబంధించినదని, వాటిని విడుదల చేయాలా, వద్దా అనేది కూడా ఆర్మీ అధికారులే నిర్ణయిస్తాని అన్నారు. కాగా, ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్ లతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం హాజరయ్యారు.
యూరిలో ఉగ్రదాడులకు ప్రతీకారంగా గతవారం పీఓకేలోని పాక్ ఉగ్రస్థావరాలపై ఆర్మీ సర్జికల్ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడులను యూపీ, పంజాబ్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ వాడుకుంటోందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మంత్రులకు ఈ సూచన చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications