భారత్ అమ్ములపొదిలో ధురంధర్- అగ్ని మిస్సైల్ టెస్ట్ సక్సెస్
భారత అమ్ములపొదిలో అత్యాధునిక మిస్సైల్ వచ్చి చేరింది. దీని పేరు.. అగ్ని ఎంఐఆర్వీ. ఇంటర్ కాంటినెంటల్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ఇది. ఇలాంటి మిస్సైల్ ను డెవలప్ చేయడం ఇదే మొదటిసారి. దీన్ని రక్షణ మంత్రిత్వ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి అగ్ని ఎంఐఆర్వీ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ను విజయవంతంగా పరీక్షించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాలలో మరో మెట్టు పైకెక్కినట్టయింది.
డీఆర్డీవో అభివృద్ధి చేసిన క్షిపణి ఇది. దీని ద్వారా మల్టీ పేలోడ్‌లను ప్రయోగించవచ్చు. హిందూ మహాసముద్ర రీజియన్ లోని వివిధ భౌగోళిక ప్రాంతాలలో విస్తరించి ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి ఈ మిస్సైల్స్. ఈ ప్రయోగం.. డీఆర్డీవో చాలా కాలంగా పనిచేస్తున్న అగ్ని-6 క్షిపణి తయారీలో అడ్డంకులు తొలగిపోయినట్టయింది. అగ్ని-6 మిస్సైల్ ప్రోగ్రామ్ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం వేచి ఉన్నామని ఇటీవలే డీఆర్డీవో చైర్‌పర్సన్ సమీర్ వీ కామత్ వెల్లడించారు.

అగ్ని-6 క్షిపణి 6,000 నుండి 10,000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. ప్రపంచ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తత మధ్య భారత్ ఇటువంటి లాంగ్ రేంజ్ క్షిపణుల అభివృద్ధిని చేపట్టింది. ఈ క్రమంలోనే అగ్ని ఎంఐఆర్వీని తెరమీదికి తీసుకొచ్చింది. విజయవంతంగా పరీక్షించింది. MIRV అంటే.. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. ఒకే క్షిపణి ద్వారా బహుళ అణ్వస్త్రాలను వేర్వేరు లక్ష్యాలకు అందించగలదు.
ఈ ప్రయోగాన్ని గ్రౌండ్, షిప్ బేస్డ్ స్టేషన్ల నుంచి పర్యవేక్షించారు డీఆర్డీఓ అధికారులు. ఆయా స్టేషన్ల నుంచి దీన్ని ట్రాక్ చేశారు. క్షిపణి దూసుకెళ్లినప్పటి నుండి పేలోడ్‌లు అన్నీ కూడా వాటి లక్ష్యాలను చేరేవరకు పూర్తి పాత్ వే ను గుర్తించారు. అనంతరం ఈ టెస్టింగ్ విజయవంతమైనట్టు ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓ, సైన్యాన్ని అభినందించారు. దేశ రక్షణ రక్షణలో ఓ కీలక ఘట్టాన్ని అందుకున్నామని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేశామని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications