డీఎస్పీ అనుపమ రిజైన్, ఫేస్‌బుక్‌లో కామెంట్స్: ఏం జరిగింది?
బెంగళూరు: కర్నాటకలోని బళ్లారి జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన కూడ్లిగి డిఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామా పైన నోరు మెదిపేందుకు అందరు జంకుతున్నారని అంటున్నారు. ఆమె పేరు ఇప్పుడు కర్నాటకలో మారుమోగుతోంది.
ఆమె నిజాయితీకి మారుపేరుగా నిలిచారని, అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించారని చెబుతుంటారు. అలాంటి డిఎస్పీ అనుపమ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె రాజీనామా నేపథ్యంలో పలువురు ఆందోళనకు దిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు.
అనుపమ రాజీనామా లేఖ రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదివారం నాడు చేరింది. ఈ నేపథ్యంలో ఆమె రాజీనామాను ఆమోదిస్తారా లేదా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

అనుపమ రాజీనామా ప్రకంపనలు సృష్టిస్తున్నందన, పైగా విపక్షాలు ఆందోళనకు దిగే సూచనలు కనిపిస్తున్నందున ఉన్నతాధికారులు ఆమెను పిలిపించుకొని రాజీనామాను వెనక్కి తీసుకోవాలని సూచించే అవకాశాలున్నాయని అంటున్నారు.
అసలేం జరిగింది?
అనుపమ కూడ్లిగి డీఎస్పీగా పని చేస్తున్నారు. నిజాయితీపరురాలుగా పేరు ఉంది. ఆమె శనివారం నాడు ఉన్నపళంగా రాజీనామా చేశారు. రెండు రోజులుగా ఎలక్ట్రానిక్, ప్రింటింగ్ మీడియాలో అనుపమ నిజాయిత పైన ప్రశంసలు కురుస్తున్నాయి.
అసలు అనుపమ రాజీనామా ఎందుకు చేశారు? దాని వెనుక గల కారణాలు ఏమిటి? అనే చర్చ సాగుతోంది. ఇటీవల కుడ్లిగిలో ఓ నిర్మాణానికి సంబంధించిన వివాదంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రముఖ నేతలను అరెస్టడు చేయడం వివాదమైంది. ఇది కూడా ఆమె రాజీనామాకు కారణమైనప్పటికీ.. వేరే బలమైన కారణాలు ఉండి ఉంటాయని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, అనుపమ తన ఫేస్‌బుక్ అకౌంటులో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవి కూడా చర్చనీయాంశంగా మారాయి.
'గొప్ప గొప్ప మాటలు చెప్పే వారంతా గొప్పవారు కాదు. చిన్న చిన్న మంచి విషయాలు అర్థం చేసుకునే వారు గొప్పవారవుతారు. అన్యాయం చట్టమైనప్పుడు తిరుగుబాటు కర్తవ్యం అవుతుంది' అని ఆమె ఆంగ్లంలో ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications