SIR లో ఓటు కోల్పోయారా?- ఏపీ, తెలంగాణ సహా 7 రాష్టాల్లో ఈసీ మరో ఛాన్స్..!
కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)లో జనం వివిధ కారణాలతో ఓటు హక్కు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓటర్లను ఈసీ ఎస్ఐఆర్ లో తొలగించగా.. ఇందులో బీఎల్వోలకు అందుబాటులో లేని, వేరే చోటుకు మారిన, మరణించిన లేదా నకిలీ ఓటరుగా గుర్తించిన వారు ఎక్కువ మంది ఉన్నారు. రాజధాని ఢిల్లీ, తెలుగు రాష్టాలైన ఏపీ, తెలంగాణ సహా మొత్తం 7 రాష్ట్రాల్లో ఇలాంటి వారికి మరో ఛాన్స్ ఇవ్వాలని ఈసీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాల సీఈఓలకు ఆదేశాలు ఇచ్చింది.
ఎస్ఐఆర్ సందర్భంగా వివిధ కారణాలతో ఓటు హక్కు కోల్పోయిన వారికి ఏడు రాష్ట్రాల్లో మరోసారి పేర్ల నమోదుకు ఈసీ అవకాశం కల్పించింది. వీటిలో ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా, నాగాలాండ్ రాష్ట్రాలున్నాయి. గతంలో ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చినప్పటికీ వివిధ కారణాలతో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చని వారికి ఈ రాష్ట్రాల్లో మరోసారి పేర్ల నమోదుకు అవకాశం కల్పించాలని ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఓట్లు కోల్పోయిన వారి ఓటర్ల వివరాలతో బూత్ ల వారీగా జాబితాలను మరోసారి ప్రదర్శించాలని ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. సంబంధిత పోలింగ్ కేంద్రాల నోటీసు బోర్డులు, పంచాయతీ భవనాలు, పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాలు, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు, పంచాయతీ అధికారుల కార్యాలయాల్లో ఈ వివరాలు అందుబాటులో ఉంచాలని ఈసీ ఆదేశించింది.

అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు సైతం తమ వెబ్ సైట్లలో ఈ వివరాలు అందుబాటులో ఉంచాలని ఈసీ తెలిపింది. వీటిని పీడీఎఫ్ రూపంలో ఆన్ లైన్లో అప్ లోడ్ చేయడంతో పాటు, వారి పేర్లు ఎందుకు చేర్చలేదనే కారణాలను కూడా అందులో పేర్కొనాలని తెలిపింది. ఆయా కేటగిరీల్లో ఉన్న ఓటర్లు తమ సాధారణ నివాస ప్రాంతానికి సంబంధించిన ఈఆర్వో, సహాయ ఈఆర్వో వద్ద ఎన్యుమరేష్ ఫారాలు మరోసారి సమర్పించే అవకాశం ఇవ్వాలని తెలిపింది. అలాగే గతంలో పాక్షికంగా నింపిన ఫారాల్ని సైతం బీఎల్వోలు, బీఎల్ఏల సాయంతో గుర్తించి, ఆయా ఓటర్లకు మళ్లీ ఫారాలు ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. అలాగే ఈసీఐ నెట్ యాప్ లోనూ ఈ ఫారాల్ని డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఒకే రాష్ట్రంలో ఇంటి అడ్రస్ మారితే ఫారం 8 సమర్పించాల్సిన అవసరం లేదు.












Click it and Unblock the Notifications
