Yami Gautam: ఫెమా ఉచ్చులో ఫెయిర్ అండ్ లవ్లీ గర్ల్: ఈడీ నుంచి సమన్లు: ఆర్థిక అవకతవకలు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ యామీ గౌతమ్ ఇబ్బందుల్లో పడ్డారు. ఆర్థిక పరమైన అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న ఆమెకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది.. సమన్లను జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఏకంగా- ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా), మనీ లాండరింగ్ కింద సమన్లను ఇవ్వడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. విదేశాల నుంచి అందిన నిధులకు సంబంధించిన వివరాలను అందజేసే విషయంలో అవకతవకలకు పాల్పడిన కారణంగానే ఈడీ సమన్లను జారీ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతం అనంతరం హిందీ చలన చిత్ర పరిశ్రమపై సీబీఐ, ఈడీ, నార్కొటిక్స్ విభాగం అధికారులు దృష్టిని కేంద్రీకరించిన విషయం తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలినట్టుగా- సుశాంత్‌సింగ్ ఆత్మహత్య ఘటన బాలీవుడ్‌లోని అనేక లోపాలను వెలుగులోకి తీసుకొచ్చింది. బాలీవుడ్‌లోని చీకటి కోణాన్ని బహిర్గతం చేసింది. డ్రగ్స్ వినియోగం కేసులో ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ యాక్టర్లు.. నార్కొటిక్స్ విభాగం విచారణకు హాజరయ్యారు. అదే పరంపరలో ఇక తాజాగా- ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ యామీ గౌతమ్‌కు సమన్లను జారీ చేసింది.

బాలీవుడ్‌తో లింకులు ఉన్న ఫ్యాషన్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మనీష్ మల్హోత్రా, సబ్యసాచిలను కిందటి నెలలోనే ఈడీ సమన్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో చాపకింద నీరులా ఫెమా ఉల్లంఘన పెద్ద ఎత్తున సాగుతోందనే ఫిర్యాదులు అందడం.. లోతుగా దర్యాప్తు చేసిన అనంతరం దీనితో ముడిపడి ఉన్న సెలెబ్రిటీలకు సమన్లను ఇస్తోండటం కలకలం రేపుతోంది. ఆరోపణలకు అనుగుణంగా యామి గౌతమ్ గనక ఫెమా ఉల్లంఘన, మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు తేలితే.. దానికి సమానమైన విలువ గల ఆస్తులను ఈడీ అటాచ్ చేయడానికి అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications