వెనక్కి తగ్గేదే లేదు!: అమెరికా కపట నీతిపై జైశంకర్ ఫైర్!
రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై అమెరికా అవలంభిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఫిన్లాండ్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమైన సమయంలో ప్రపంచ చమురు మార్కెట్‌ను స్థిరీకరించడానికి, చమురు ధరలు పెరగకుండా నియంత్రించడానికి రష్యా చమురును కొనాల్సిందిగా స్వయంగా అమెరికాయే భారత్‌ను కోరిందని జైశంకర్ ఈ సందర్భంగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు.
భారత్ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు జైశంకర్ తనదైన శైలిలో గట్టి సమాధానమిచ్చారు. చమురు లభ్యత, ధర ఆధారంగా భారత్ నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన్ కొత్తలో యూరప్ దేశాలన్నీ తమకు చమురు సరఫరా చేసే మిడిల్ ఈస్ట్ మార్కెట్ నుంచి చమురును భారీగా కొనుగోలు చేశాయని.. ఆ సమయంలో మార్కెట్ పరిస్థితుల కారణంగానే భారత్ రష్యా వైపు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

అమెరికా తన అవసరాలకు తగినట్లుగా ఆంక్షలు విధించడం, మళ్లీ ఎత్తివేయడం వంటి ద్వంద్వ విధానాలపై జైశంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు గతంలో మాపై భారీ సుంకాలు విధించిన అమెరికా.. ఆ తర్వాత మళ్లీ ఆంక్షలను ఎత్తివేసింది. ఇందులో ఎలాంటి గొప్ప సిద్ధాంతాలు లేవు. తమకు నచ్చినప్పుడు ఆంక్షలు పెట్టడం, నచ్చనప్పుడు తీసేయడం ఓ ఆటగా మారిపోయింది. ఇక్కడ ఎవరూ చిన్నపిల్లలు కారు.. ఈ ఆట ఎలా సాగుతుందో అందరికీ తెలుసు" అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ఇరాన్ యుద్దం ప్రారంభమైన అనంతరం చమురు ధరలను అదుపులో ఉంచడానికి అమెరికా ఈ ఆంక్షల నుంచి మినహాయింపులు ఇచ్చిందని.. కాబట్టి దీనికి నైతిక రంగులు పూయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా ఆంక్షలతో సంబంధం లేకుండా భారత్ తన ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల ఆధారంగానే రష్యా చమురును కొనుగోలు చేస్తోందని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తుందని భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గత నెలలో జరిగిన ఓ మీడియా సమావేశంలో చమురు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ మాట్లాడుతూ.. "అమెరికా మినహాయింపులు ఇవ్వకముందు ఇచ్చినప్పుడు, ఆ గడువు ముగిసిన తర్వాత కూడా భారత్ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూనే ఉంది. దేశ ఇంధన అవసరాలే మా మొదటి ప్రాధాన్యత అని సుజాతా శర్మ స్పష్టం చేశారు.
ఇదే వేదికపై యూరప్ దేశాల నైతిక వైఖరిని కూడా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఏ యూరప్ దేశంపై కూడా భారతీయ ఆయుధాలతో దాడులు జరగలేదని.. కానీ భారత్‌పై దాడులు చేయడానికి యూరప్ ఆయుధాలు దశాబ్దాలుగా ఎలా ఉపయోగపడ్డాయో అందరికీ తెలుసని గుర్తు చేశారు. భారతీయులు ఎప్పుడూ యూరప్ భద్రతకు ముప్పు తీసుకురాలేదని.. కానీ యూరప్ మాత్రం భారత్‌పై దాడులు చేసే దేశాలకు ఆయుధాలు విక్రయిస్తూ వస్తోందని జైశంకర్ తన ఘాటైన కామెంట్లతో పాశ్చాత్య దేశాల కపట నీతిని అంతర్జాతీయ వేదికపై బట్టబయలు చేశారు.












Click it and Unblock the Notifications