వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పంచాయితీ: మహారాష్ట్ర ఎస్ఈసీకి అసెంబ్లీ జైలు శిక్ష విధించినప్పుడు ఏం జరిగింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
నిమ్మగడ్డ రమేశ్ కుమార్, వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య వివాదం ఏడాదిగా తీవ్రమవుతూనే ఉంది. ప్రస్తుతం అది ముదిరిపాకాన పడింది. చివరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రాసిన ఒక లేఖ సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఇద్దరు సీనియర్ మంత్రులు చేసిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభమయ్యింది.

దాంతో ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తీసుకుంటుందోననే చర్చ మొదలయ్యింది.

ఇటీవల రాష్ట్రంలో మంత్రుల తీరు మీద ఎస్ఈసీ రాసిన లేఖ ఈ వివాదానికి మూలం. ఈ లేఖలో తమను అవమానించారని మంత్రులు చెబుతుండగా, ఎస్ఈసీ మాత్రం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. గవర్నర్‌కి రాసిన ఈ లేఖలోని అంశాలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కూడా స్పందించారు. ప్రివిలేజ్ కమిటీకి లేఖను పంపించారు. దానిపై అత్యవసరంగా ప్రివిలేజ్ కమిటీ సమావేశం అయ్యింది.

ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి

ప్రివిలేజ్ కమిటీ ఏం చేస్తుంది..

ఎస్ఈసీ మీద మంత్రులు చేసిన ఫిర్యాదులను ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ పరిశీలించింది. ప్రివిలైజ్ కమిటీ అధ్యక్షుడు , వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ సమావేశానికి నలుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు.

ఈ కమిటీలో టీడీపీ తరుఫున సభ్యుడిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ ఈ నోటీసులపై చర్చను తప్పుబట్టారు. ఆర్టికల్ 243కే ప్రకారం నిమ్మగడ్డ లేఖ రాసి ఉంటారని పేర్కొన్నారు. అయితే కాకాణి గోవర్థన్ రెడ్డి మాత్రం దానిని తోసిపుచ్చుతూ ఇది ఎస్ఈసీ హక్కులకు సంబంధించిన అంశం కాదని, మంత్రులిచ్చిన ఫిర్యాదులపై చర్చించాలని సూచించారు.

రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య వివాదం కావడంతో దానిపై న్యాయపరమైన అన్ని అంశాలను ప్రస్తావించాల్సి ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు. దానికి తగ్గట్టుగా ప్రివిలేజ్ కమిటీ ప్రత్యక్ష సమావేశం కావాలని నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే లోతుగా చర్చించిన తర్వాత ఎస్ఈసీకి నోటీసులు ఇవ్వాలా లేదా అన్న నిర్ణయానికి వస్తారని అసెంబ్లీ వర్గాలు బీబీసీకి తెలిపాయి.

ఈ సందర్భంగా మహారాష్ట్రలో ఎస్ఈసీకి సంబంధించి జరిగిన అనుభవాన్ని సభ్యులు చర్చించారు.

బొత్స సత్యన్నారాయణ

ఏపీ మంత్రుల ఫిర్యాదులో ఏముంది

ఏపీలో మంత్రులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఎస్ఈసీ జనవరి 27వ తేదీన గవర్నర్‌కి లేఖ రాశారు. పరిధికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని, విమర్శలు చేస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖకి గవర్నర్ స్పందించకపోతే తాను అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయిస్తారనని పేర్కొన్నారు. ఇది తమను అవమానించడం, గవర్నర్‌ని బెదిరించడమేనని మంత్రులు ఆరోపిస్తున్నారు. ఆ లేఖనే ఆధారంగా చేసుకుని ఏపీ అసెంబ్లీ రూల్ 173 ప్రకారం ప్రివిలేజ్ కమిటీకి మంత్రులు బొత్సా సత్యన్నారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు.

సభలో సభ్యుల హక్కులకు భంగం వాటిల్లిందని భావిస్తే ఫిర్యాదు చేసే అవకాశం రూల్ 173 కింద ఉంది. సభలో మాత్రమే కాకుండా, బయట కూడా సభ్యులకు సంబంధించి ప్రోటోకాల్ సహా అన్ని అంశాలలోనూ ఈ రూల్ వర్తిస్తుంది. ఏపీ అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న మంత్రులిద్దరూ తమ హక్కులకు భంగం వాటిల్లేలా ఎస్ఈసీ లేఖ రాశారని పేర్కొంటున్న తరుణంలో దానిని విచారణకు స్వీకరించే అంశంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ దానిని ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. కమిటీ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని కమిటీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రుల ఫిర్యాదుని పరిగణలోకి తీసుకుని, వివరణ కోరేందుకు నోటీసులు ఇవ్వడం వంటి చర్యలు తీసుకునే అవకాశం కమిటీకి ఉంటుందని మీడియాతో ఆయన అన్నారు.

''మమ్మల్ని సంజాయిషీ అడగలేదు. వివరణ కోరలేదు. కనీసం మా తీరు మీద ముఖ్యమంత్రితో మాట్లాడలేదు. ఏకంగా గవర్నర్ గారికి లేఖ రాశారు. గవర్నర్ ని బెదిరించేలా లేఖ ఉంది. మీరు స్పందించకపోతే ఫైనల్ గా కోర్టుకి పోతానని ఆయన గవర్నర్ ని బెదిరించారు. మాకు న్యాయం జరగాలి. మమ్మల్ని అగౌరవపరిచేలా ఎస్ఈసీ వ్యవహరించారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని స్పీకర్ ని కోరాము. తగిన రీతిలో స్పందిస్తారని ఆశిస్తున్నాం’’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాకు తెలిపారు.

మహారాష్ట్ర ఎస్ఈసీకి జైలు శిక్ష విధించిన అసెంబ్లీ

14 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో ఎన్నికల సంఘం, ప్రభుత్వం మధ్య వివాదం కూడా ప్రివిలేజ్ కమిటీకి చేరింది. 2006లో స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో నాటి ఎస్ఈసీ నందలాల్ అనే ఐఏఎస్ అధికారి సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చాయి.

నాటి ఎమ్మెల్యే జనార్థన్ చందూర్కర్ ఇచ్చిన ఫిర్యాదుతో కమిటీ ఎస్ఈసీకి నోటీసులు జారీ చేసింది. అయితే ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకాకుండా, డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారితో వివరణ పంపించిన ఎస్ఈసీ తీరుపై కమిటీ సీరియస్ అయ్యింది. వారం రోజుల పాటు కారాగార శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత దానిని రెండు రోజులకు కుదించారు.

తాను స్పీకర్‌ని కలిసి మాట్లాడుతానని, గవర్నర్‌కి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఎస్ఈసీ నందలాల్ కోరినా అంగీకరించకపోవడం విశేషం. చివరకు 2008 మార్చి 27, 28 తేదీలలో ఆయన సాధారణ జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

తదుపరి ఈ అంశంపై న్యాయస్థానాల్లో విచారణ కూడా జరిగింది. ఆర్టికల్ 21ని ఉల్లంఘించారని సుప్రీంకోర్టులో నందలాల్ పిటీషన్ వేశారు. అయితే ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం ఆధారంగా మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. పలుమార్లు అవకాశం ఇచ్చినా కమిటీ ముందు హాజరుకావడంలో ఎస్ఈసీ విఫలమయ్యారని, చర్యలు సమంజమేనని వ్యాఖ్యానించింది.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌తో తగాదా

కరోనా ఉధృతి తగ్గిన నేపథ్యంలో పంచాయితీ ఎన్నికల పోరు కోసం ఏపీ ఎన్నికల సంఘం సన్నాహాలు చేసింది. అందులో భాగంగా జనవరి 9న షెడ్యూల్ విడుదల చేసింది. దానిని తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దానిని ఎస్ఈసీ డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేయడంతో ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. అయినా ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ వేసినా సానుకూలత దక్కలేదు.

చివరకు న్యాయస్థానాల ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయినప్పటికీ ప్రభుత్వం , ఎస్ఈసీ మధ్య పోరు ఆగలేదు. అనేక అంశాల్లో ఇరువర్గాలూ తలపడుతున్నట్టు కనిపిస్తోంది. ఎస్ఈసీ నోటీసులను ప్రభుత్వం తిప్పిపంపించడం పరిపాటి అయ్యింది. ఈ విషయంపై గవర్నర్‌కి ఎస్ఈసీ ఫిర్యాదు చేసే వరకూ వ్యవహారం వెళ్లింది.

అధికారులతో దోబూచులాట

ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వివాదంలో పలువురు అధికారుల పోస్టింగ్స్ వివాదం కుర్చీలాటను తలపిస్తోంది. ఎస్ఈసీ ఎంపిక చేసిన అధికారులను ప్రభుత్వం తిరస్కరించడం, తాము పంపించిన ముగ్గురు అధికారుల జాబితా నుంచే ఎంపిక చేయాలని పట్టుబట్టడంతో ఈ వ్యవహారం దోబూచులాటగా కనిపిస్తోంది. తొలుత ఖాళీగా ఉన్న ఎస్ఈసీ కార్యదర్శి పోస్ట్ కోసం ముగ్గురు అధికారుల జాబితాను ఏపీ ప్రభుత్వం పంపించింది. కానీ ఎస్ఈసీ మాత్రం ఆ ముగ్గురిని కాదని ముద్దాడ రవిచంద్ర అనే అధికారిని ప్రతిపాదించారు. దానికి ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. చివరకు ప్రభుత్వం పంపించిన జాబితా నుంచి కే కన్నబాబుని కార్యదర్శి పదవికి ఎస్ఈసీ ఎంపిక చేయడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

అంతకుముందే పంచాయితీరాజ్ విభాగంలో ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ విషయంలో ఎస్ఈసీ వ్యవహారంపైనా ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంటూ, వారి సర్వీసు రూల్స్ లో అభిశంసన విషయాన్ని ప్రస్తావించాలని ఆదేశించారు. దానికి సీఎస్ తిరస్కరించారు. ఎస్ఈసీకి అలాంటి అధికారం లేదని ప్రభుత్వం పేర్కొంది. చివరకు ఈ అంశంలో ఎస్ఈసీ వెనక్కి తగ్గడంతో వివాదం తాత్కాలికంగా సమసిపోయినట్టు కనిపిస్తోంది.

తాజాగా ఎన్నికల విధుల నుంచి ఎస్ఈసీ ఆదేశాలతో తొలగించిన చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల స్థానంలో కొత్త వారి నియామకం కూడా వివాదంగా మారింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడేసి పేర్లను పక్కన పెట్టేసి ఎస్ఈసీ మరో ఇద్దరి పేర్లను కలెక్టర్లుగా ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వం చిత్తూరు కలెక్టర్ స్థానానికి ఎస్ఈసీ చెప్పిన పేరుని అంగీకరిస్తూనే గుంటూరు విషయంలో ససేమీరా అంటోంది. దాంతో ఈ అంశంలోనూ రెండు శిబిరాల మధ్య విబేధాలు తెరమీదకు వచ్చాయి.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్

ఏడాదిగా ఇదే తరహా ఆధిపత్య పోరు..

ఏపీలో స్థానిక ఎన్నికల విషయమై అటు ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా పంతాలకు పోతున్నారనే అభిప్రాయం పలువురిలో ఉంది. గత ఏడాది మార్చిలో ఎన్నికలు జరపాల్సిందేనని ప్రభుత్వం ఆశిస్తే, ఎస్ఈసీ మాత్రం ససేమీరా అనడంతో వివాదానికి ఆరంభమయ్యింది. అప్పట్లో ఇది సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల వాయిదాపై ఎస్ఈసీని తప్పుబడుతూనే, కరోనా నేపథ్యంలో ఎన్నికల వాయిదాని కోర్టు సమర్థించింది. ఆ తర్వాత వేగంగా మారిన పరిణామాలతో ఏకంగా ఎస్ఈసీని తొలగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసే వరకూ వెళ్లింది. ఎన్నికల సంఘం బాధ్యతలను జస్టిస్ కనగరాజ్ అనే తమిళనాడు కు చెందిన రిటైర్డ్ జడ్జికి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదం అయ్యింది. ఏపీ ప్రభుత్వ ఆర్డినెన్స్ చట్టబద్ధం కాదంటూ కోర్టు కొట్టేయడంతో నిమ్మగడ్డ తొలగింపు కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చెల్లలేదు. చివరకు మళ్లీ నిమ్మగడ్డ ఎస్ఈసీ గా బాధ్యతలు స్వీకరించారు.

''అధికారాలను పెత్తనానికి వాడడం వల్లే సమస్యలు..’’

''ప్రభుత్వం, ఎస్ఈసీ తీరు సరిగా లేదు. వ్యవస్థల మధ్య వివాదాలకు కారకులయ్యారు. ముఖ్యమంత్రి స్వయంగా ఎస్ఈసీ మీద వ్యక్తిగత విమర్శలకు పూనుకోవడం దానికి నిదర్శనం. ఆ తర్వాత ఎస్ఈసీ కూడా ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్న కోర్టు ఆదేశాలను పాక్షికంగానే అమలు చేసినట్టు కనిపిస్తోంది. ఇది సమంజసం కాదు. వ్యక్తిగత పట్టుదలతో ప్రజలను, వ్యవస్థను ఇబ్బంది పెట్టకూడదు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఎస్ఈసీ తీరు ఉంది. ఓటర్ల జాబితా అప్ గ్రేడ్ చేయలేదంటూ ఇద్దరు పీఆర్ అధికారులను తప్పుబట్టిన ఎస్ఈసీ తన బాధ్యతను ఎందుకు మరిచారు. 2019 నాటి ఓటర్ల జాబితా ఎందుకు అప్ డేట్ కాలేదన్నది రాష్ట్ర ఎన్నికల సంఘం చూసుకోవాలి కదా. తన వైఫల్యానికి కూడా ఎవరినో నిందించే పరిస్థితి శ్రేయస్కరం కాదు. సీఎంవో లో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్ విషయంలోనూ అత్యుత్సాహమే. ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారాలను ఎవరి మీదనో పెత్తనానికి వాడడం వల్ల సమస్యలు వస్తున్నాయి. పాలకపక్షం కూడా పరిధి మేరకు వ్యవహరించాలి’’ అని రాజకీయ వ్యాఖ్యాత పి అచ్యుత్ దేశాయ్ బీబీసీ వద్ద అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Election Fight in Andhra Pradesh: What happened when the Maharashtra SEC was jailed by the Assembly?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X