జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ???
జైపూర్‌లో జరిగిన ఒక ఫోటోషూట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రష్యన్ ఫోటోగ్రాఫర్ Julia Buruleva ఒక ఏనుగుకు పూర్తిగా గులాబీ రంగు పూసి ఫోటోలు తీయడంతో సోషల్ మీడియాలో భారీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చర్యను చాలా మంది జంతు హింసగా అభివర్ణిస్తున్నారు.
వివాదానికి దారితీసిన ఫోటోషూట్..
Jaipur లో జరిగిన ఈ ఫోటోషూట్‌లో, సంప్రదాయ రాజస్థానీ ద్వారాల ముందు పింక్ రంగులో ఉన్న ఏనుగుతో మోడల్‌ను ఫ్రేమ్ చేశారు. ఈ విజువల్ కాన్సెప్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే అది వైరల్ అయింది. అయితే అందమైన ఫ్రేమ్ కంటే, ఆ ఏనుగుకు వేసిన రంగుపైనే ఎక్కువ చర్చ మొదలైంది.

కళాత్మక ఆలోచన అంటూ వివరణ..
ఈ ప్రాజెక్ట్ గురించి Julia Buruleva మాట్లాడుతూ... రాజస్థాన్ సంస్కృతి, రంగుల అందం తనను ఆకర్షించాయని తెలిపారు. వారాల పాటు నగరాన్ని పరిశీలించిన తర్వాతే "పింక్ ఏనుగు" కాన్సెప్ట్ తనకు వచ్చిందని చెప్పారు. రాజస్థాన్‌కు ఏనుగులు ఒక ముఖ్యమైన ప్రతీక అని, అందుకే వాటిని తన ఫోటోషూట్‌లో భాగం చేసుకున్నానని వివరించారు.
ఈ ఫోటోషూట్ కోసం అనేక సవాళ్లు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. ఏనుగుల సంరక్షణ కేంద్రాలను పలుమార్లు సందర్శించడం, షూట్‌కు అనువైన ఏనుగును ఎంపిక చేయడం, అనుమతులు పొందడం వంటి ప్రక్రియలు క్లిష్టంగా మారాయని చెప్పారు. షూట్‌లో పాల్గొనే మోడల్‌ను కనుగొనడమూ కష్టమైందని, సామాజిక కారణాలతో చాలామంది నిరాకరించారని వెల్లడించారు.
"సురక్షిత రంగు" వాడినట్లు వివరణ..
జంతు హింస ఆరోపణలపై స్పందిస్తూ ఆమె... "మేము ఉపయోగించిన రంగు పూర్తిగా సేంద్రియమైనది. ఇది స్థానిక పండుగల్లో ఉపయోగించే రంగే. ఏనుగుకు ఎలాంటి హాని జరగలేదు" అని పేర్కొన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, జంతువుకు ఇబ్బంది కలగకుండా చూసుకున్నామని ఆమె స్పష్టం చేశారు.
నెటిజన్ల ఆగ్రహం..
అయితే ఈ వివరణను చాలామంది అంగీకరించలేదు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. "లైక్స్ కోసం జంతువులను ఇలా ఉపయోగించడం సరైంది కాదు", "ఇది కళ కాదు, జంతు హింస" అంటూ పలువురు మండిపడ్డారు. మరికొందరు సృజనాత్మకత పేరుతో బాధ్యతారాహిత్యానికి తావివ్వకూడదని వ్యాఖ్యానించారు.
ఇక జంతు హక్కుల కార్యకర్తలు కూడా ఈ ఘటనపై స్పందించారు. జంతువులను అలంకరణ వస్తువుల్లా ఉపయోగించడం తగదని, ముఖ్యంగా వన్యప్రాణుల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని సూచించారు. ఇలాంటి ఫోటోషూట్లు తప్పు సందేశాన్ని సమాజానికి ఇస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
కానీ కొంతమంది నెటిజన్లు ఈ వివాదంపై ఆసక్తికర సూచనలు కూడా చేశారు. "ఇలాంటి కాన్సెప్ట్ కోసం నిజమైన ఏనుగు అవసరం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా డిజిటల్ ఎడిటింగ్‌తో కూడా ఇదే విజువల్ సృష్టించవచ్చు" అని పేర్కొన్నారు.
Julia Buruleva బార్సిలోనా కేంద్రంగా పనిచేసే కాన్సెప్టువల్ ఫోటోగ్రాఫర్. కళ, ఫ్యాషన్, థియేటర్, పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ అంశాలను కలిపి ప్రత్యేకమైన విజువల్స్ సృష్టించడం ఆమె ప్రత్యేకత. ఆమె ప్రాజెక్టులు సాధారణంగా క్రియేటివ్‌గా ఉంటాయి కానీ ఈసారి మాత్రం వివాదంలో చిక్కుకున్నాయి.
చట్టపరమైన కోణం?
భారతదేశంలో జంతు సంక్షేమానికి సంబంధించి కఠిన నిబంధనలు ఉన్నాయి. ఈ ఘటనలో ఉపయోగించిన రంగు, అనుమతులు వంటి అంశాలపై అధికారులు పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. అవసరమైతే చర్యలు తీసుకునే అవకాశమూ ఉంది.












Click it and Unblock the Notifications