ఉక్రెయిన్ లో బిక్కుబిక్కుమంటూ - భారత పౌరులకు కీలక సూచనలు : తెలుగు విద్యార్ధుల తరలింపు..!!
ఉక్రెయిన్ లో రష్యా దాడులు మూడో రోజు కొనసాగుతున్నాయి. అక్కడ నుంచి స్వదేశానికి వచ్చేందుకు స్థానికంగా భారతీయులు ఎదురు చూస్తున్నారు. భారత ప్రభుత్వ సూచనల మేరకు అక్కడి రాయబార కార్యాలయంలో సరిహద్దు దేశాల నుంచి విమానాల ద్వారా స్వదేశానికి భారతీయులను తరలించే ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా తొలి విమానం ఈ రోజు భారత్ కు చేరుకోనుంది. మొత్తం 19 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ లో ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. వారంతా అక్కడి ప్రస్తుత పరిస్థితుల్లో ఆందోళనతో ఉన్నారు.
Recommended Video

రాయబార కార్యాలయం సూచన
ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన భారత పౌరులకు కైవల్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. సరిహద్దు పోస్టుల వద్దనున్న భారత అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా ఉక్రెయిన్ సరిహద్దు పోస్టుల వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు భారతీయ పౌరులకు సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
సౌత్ ఈస్ట్ ఉక్రెయిన్ లోని జఫ్రోజియా స్టేట్ మెడికల్ వర్సిటీలోనే 10మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉండిపోయారు. రాత్రి కాసేపు బంకర్ లో ఆ తర్వాత తిరిగి హాస్టల్ లో విద్యార్థులు గడిపారు. సమాచారం లేకుండా హాస్టల్ నుంచి అడుగుబయటపెట్టొద్దని వర్సిటీ ఆదేశించింది. అక్కడి పరిస్థితుల్లో విద్యార్ధుల తల్లి తండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

విద్యార్ధుల తల్లితండ్రుల్లో ఆందోళన
తమ పిల్లలను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇప్పటికే ఏపీ..తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. ప్రత్యేక హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసాయి. ఈ రోజు ఉక్రెయిన్ నుంచి భారత్ కు తీసుకొస్తున్న వారిలో 22 మంది తెలుగు విద్యార్ధులు ఉన్నారు. అలాగే కేరళ నుంచి 17, తమిళనాడు నుంచి నలుగురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో విద్యార్ధులకు సహాయం అందించేందుకు..వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. రాష్ట్ర స్థాయిలో..అదే విధంగా పలు జిల్లాల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసారు.

తెలుగు రాష్ట్రాల విద్యార్దులు సైతం
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. సహాయం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కంట్రోల్ రూమ్ నెంబర్ 08812-224519కు కాల్ చేయొచ్చని అధికారులు తెలిపారు. విశాఖలో 24 గంటలు పనిచేసేలా 0891-2590100 టెలిఫోన్ ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకపోయిన జిల్లాకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సాయం కోసం ఈ నెంబర్‌కు కాల్ చేయొచ్చు. సాయంత్రం మరో విమానం ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారితో స్వదేశానికి బయలు దేరుతుందని..ఇందుకు సంబంధించి కసరత్తు కొనసాగుతుందని సమాచారం.












Click it and Unblock the Notifications