జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీకి ఉగ్రవాదులకు మధ్య భీకర ఎన్ కౌంటర్; ఐదుగురు సైనికుల మృతితో ఆర్మీకి షాక్!!
జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్ లతో అట్టుడుకుతోంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవటం ఆర్మీకి పెను సవాల్ గా మారింది. నిత్యం జమ్మూ కాశ్మీర్ తుపాకీ శబ్దాలతో భయోత్పాతాన్ని సృష్టిస్తుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో సోమవారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు భారత సైనికులు మరణించారు. మరణించిన వారిలో నలుగురు జవాన్లు మరియు ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) ఉన్నారని సమాచారం.
పూంచ్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాల సమాచారం మేరకు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రత దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పూంచ్ జిల్లాలోని సూరన్ కోట్ డికెజికి దగ్గరగా ఉన్న చర్మేర్ అటవీ ప్రాంతంలోకి ఉగ్ర మూక చొరబడిన నిఘా వర్గాల సమాచారంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడిస్తున్నారు. దాదాపు ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు అక్కడ ఉన్నట్లుగా గుర్తించి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.

సెర్చ్ పార్టీలపై ఉగ్ర దాడులు ... ఐదుగురు సైనికులు మరణం
ఈ క్రమంలో సెర్చ్ పార్టీలపై ఉగ్రవాదులు భారీ కాల్పులు జరిపారని, ఫలితంగా జెసిఒ మరియు మరో నలుగురు జవాన్లు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఐదుగురు సైనికులు తీవ్ర గాయాలతో మరణించారని ధృవీకరించారు. తీవ్రంగా గాయపడిన జె సి ఓ మరియు నలుగురు జవాన్లను సమీప వైద్య సదుపాయానికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందని వెల్లడించారు. ఉగ్రవాదులను పట్టుకోవడం కోసం ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది అని ఆర్మీ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.
అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన ఆర్మీ .. కొనసాగుతున్న ఎన్ కౌంటర్
సురాన్ కోట్ ఉపవిభాగంలో మొఘల్ రోడ్డు సమీపంలో ఉన్న అడవుల్లోకి చొరబాటుదారులు ఉన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసి) దాటి చార్మేర్ అడవిలో భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదుల గుంపు చొరబడినట్లు సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను మట్టు పెట్టడం కోసం వారు ఉన్న అటవీ ప్రాంతం నుండి తప్పించుకునే అన్ని మార్గాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నాయి.
కాశ్మీర్ లో మరో రెండు చోట్ల ఘటనలు .. ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఇదిలా ఉంటే కాశ్మీర్ లోయలో సామాన్య పౌరులపై జరుగుతున్న దాడులను అరికట్టడం కోసం, ఉగ్రమూకను పట్టుకోవడం కోసం, భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాల్లో ఒక ఉగ్రవాది, అనంతనాగ్‌లోమరొక ఉగ్రవాది మరణించారు. బందిపోరాలో మృతి చెందిన ఉగ్రవాదిని ఇంతియాజ్ అహ్మద్ దార్ గా గుర్తించారు. ఇతనికి ఇటీవల బందిపోరాలో షాగుండ్ లో జరిగిన పౌరుల హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తుంది.
భద్రతా దళాలకు పెను సవాళ్ళను విసురుతున్న చొరబాట్లు
దార్ లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ కు చెందిన వాడని కాశ్మీర్ పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇటీవల కాశ్మీర్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, విపరీతంగా పెరుగుతున్న ఉగ్రవాద చొరబాట్లు జమ్మూకాశ్మీర్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భద్రతా దళాలకు పెను సవాళ్లను విసురుతున్నాయి. ఇప్పటికే ఇంటిలిజెన్స్ భారీగా ఉగ్రవాదుల చొరబాట్ల గురించి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో బోర్డర్ లో భద్రతా సిబ్బందిని పెంచి మరీ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది ఇండియన్ ఆర్మీ .












Click it and Unblock the Notifications