శేషాచలం ఎన్‌కౌంటర్‌పై కొత్త వివాదం, వీడియో రిలీజ్ చేసిన పోలీసులు
చిత్తూరు/చెన్నై: చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగర్లు, కూలీల ఎన్‌కౌంటర్ మరో మలుపు తిరిగింది! తమ బంధువులను బస్సులో నుండి దించి ఎన్‌కౌంటర్ చేశారని మృతి చెందిన కొందరు కూలీల బంధువులు బుధవారం ఆరోపిస్తున్నారు.
తమ బంధువులు నగరి - పుత్తూరు బస్సులో నుండి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కిందకు దించి ఎన్‌కౌంటర్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. పలువురు తమిళ కూలీలు లేదా స్మగర్లు సంఘటన స్థలం నుండి తప్పించుకున్నారు. వారే ఈ విషయాన్ని చెప్పారని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మృతదేహాలతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. మరోవైపు, తమిళనాడులో నిరసనలు కొనసాగుతున్నాయి.

వీడియో ఫుటేజీలు విడుద చేసిన పోలీసులు
ఎన్‌కౌంటర్ పైన విమర్శల నేపథ్యంలో పోలీసు అధికారులు గురువారం వీడియో ఫుటేజీని విడుదల చేశారు. వారం రోజులుగా 500 మంది ఎర్ర చందనం కూలీలు వచ్చారని చెప్పారు. వారు తమకు ఎలా ఎదురు పడ్డారో ఫుటేజీలో ఉందని చెప్పారు. వారు మూడు ప్రాంతాల్లో చెట్లు నరికివేసిన దృశ్యాలు ఫుటేజీలో ఉన్నాయి. స్మగ్లర్ల కోసం ఇంకా వేట కొనసాగుతోంది.
డీజీపీ వివరణ
జాతి సంపదను దోచేస్తుంటే చూస్తు ఊరుకోవాలా అని ఏపీ డీజీపీ రాముడు అన్నారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్ కొనసాగుతుందన్నారు. తమకు బస్సులో నుండి దింపి ఎన్‌కౌంటర్ చేయవలసిన అవసరం లేదని చెప్పారు. మానవ హక్కుల నోటీసులు తమకు అందలేదని చెప్పారు. పోలీసుల పైన వారు దాడి చేయడంతోనే ఎన్‌కౌంటర్ పరిస్థితి వచ్చిందన్నారు. వారు లొంగిపోతే అరెస్టయ్యేవారని చెప్పారు.
హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్, ఎల్లుండికి వాయిదా
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని రఘునాథ్ అనే న్యాయవాది పిటిషన్ వేశారు. మృతిచెందిన వారిపై అసహజ మరణం అని కేసులు నమోదు చేశారా? లేదా? పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు ఎవరు? బాధితులను గుర్తించారా? బాధితులు ఎక్కడివారు? అని రఘునాథన్ తన పిటిషన్‌లో ప్రశ్నించారు.
రఘునాథన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రెండు రోజుల్లో పూర్తి నివేదికను అందజేయాలని ఏపీ డీజీపీని ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున లాయర్... వారు రాళ్లు రువ్విన తర్వాతనే పోలీసులు ప్రతిస్పందించారని కోర్టుకు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక, ఎన్‌కౌంటర్ పైన కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు రెండు రోజుల సమయమిచ్చింది.
తమిళనాడు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా
ఎన్‌కౌంటర్లో మృతి చెందిన కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం, ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మొత్తం ఇరవై కుటుంబాలకు ఈ ఎక్స్‌గ్రేషియా ఇవ్వనుంది.












Click it and Unblock the Notifications