వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పాకిస్తాన్‌లోని మా తాతల గ్రామాన్ని ఈ జన్మలో చూడలేననుకున్నా.. మా తాతలాగే తయారై పాక్‌లో అడుగు పెట్టా.. ఆ తర్వాత..'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సర్శ్ అహూజా

భారతదేశ విభజన సమయంలో ఎన్నో లక్షల కుటుంబాలు తమ ఇళ్లు, వాకిళ్లు విడిచిపెట్టి పారిపోయాయి. అలా పారిపోయి భారతదేశానికి వచ్చినవారిలో సర్శ్ అహూజా కుటుంబం కూడా ఒకటి. అప్పటికి సర్శ్ తాత యుక్తవయసులో ఉన్నారు. భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఆయన ఎక్కడికి పారిపోయి తలదాచుకున్నారో ఎవరికీ చెప్పలేదు. ఆ కథ చెప్పమని సర్శ్ వాళ్ల తాతయ్యను అడిగారు. 75 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ ఆయన తన కథ చెప్పుకొచ్చారు.

స్పర్శ్ చేతిలో మూడు చిన్న రాళ్లు ఉన్నాయి. అవి తనకు ఎంతో విలువైనవి. తన పూర్వీకులు నివసించిన ప్రదేశాలకు గుర్తులవి. ఆ రాళ్లను చేరుకోవడానికి స్పర్శ్ అయిదేళ్ల క్రితం తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తన తాత ఇషార్ దాస్ అరోరాను కలవడానికి భారతదేశానికి వచ్చారు స్పర్శ్.

ఇషార్ దాస్ ఉర్దూలో నోట్స్ రాసుకోవడం గమనించారు. ఉర్దూ పాకిస్తాన్‌లో అధికారిక భాష. తన తాత పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చారని తనకు తెలుసు. కానీ, అప్పటి సంఘటనల గురించి కుటుంబంలో ఎవరూ మాట్లాడేవారు కాదని స్పర్శ్ చెప్పారు. టీవీలో లేదా ఏదైనా బోర్డు గేమ్ ఆడుతున్నప్పుడు పాకిస్తాన్ పేరు వినబడితే నిశ్శబ్దం ఆవహించేదని ఆయన చెప్పారు.

స్పర్శ్‌కు అప్పటి వివరాలు తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ఒకసారి చెస్ ఆడుతుండగా, స్పర్శ్ తన తాతయ్యను కదిలించారు. ఆయన చిన్నప్పటి విశేషాలు చెప్పమని కోరారు.

"మా తాత చాలా సంకోచించారు. 'అదేం పెద్ద ముఖ్యం కాదు, ఎందుకు దాని గురించి అడుగుతావు?' అంటూ తప్పించుకోవాలని చూశారు. కానీ, మెల్లగా ఆయన చెప్పడం మొదలుపెట్టారు" అని స్పర్శ్ చెప్పారు.

తన తాతయ్య చెప్పే కథను రికార్డ్ చెయ్యాలని స్పర్శ్ భావించారు. అందుకు ఇషార్ ఒప్పుకున్నారు.

స్పర్శ్ వాళ్ల అమ్మమ్మ, తాతయ్య కోసం మంచి సూట్, టై తీసిపెట్టారు. అవి వేసుకుని కథ చెప్పడానికి సిద్ధమయ్యారు ఇషార్. తల దువ్వుకుని, తెల్ల చొక్కా వేసుకుని, సౌకర్యంగా కూర్చుని తన కథ చెప్పడం ప్రారంభించారు. ఆ కథ తన జీవితాన్ని మార్చేసిందన్నారు స్పర్శ్.

స్పర్శ్ లండన్‌లో ఉంటారు. నేను ఆయన్ను అక్కడే కలిశాను. తన తాత చెప్పిన కథను నాకు వినిపించారు.

దేశ విభజన

పాకిస్తాన్‌లో పుట్టి...

ఇషార్ దాస్ 1940లో బేలా గ్రామంలో పుట్టారు. అక్కడ ముస్లిం జనాభా అధికంగా ఉండేవారు. పంజాబ్‌లో జండ్‌కు సమీపంలో ఉంది ఈ గ్రామం. ఇషార్ దాస్ తల్లిదండ్రులు రోడ్డు పక్కన చిన్న దుకాణం నడుపుతూ వేరుశెనగపలుకులు అమ్మేవారు. విభజనకు ముందు బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంలో ఆ గ్రామం ప్రశాంతంగానే ఉండేది.

ఇషార్ దాస్‌కు ఏడేళ్లు వచ్చేటప్పటికి విభజన గొడవ మొదలైంది. అప్పుడు ఆ గ్రామంపై దాడులు జరిగాయి.

హిందువులైన ఇషార్ దాస్ కుటుంబం ఆ గ్రామ పెద్దగా వ్యవహరిస్తున్న ముస్లిం వ్యక్తి ఇంట్లో తలదాచుకుంది. తుపాకీలు పట్టుకుని, హిందువుల కోసం వెతుకుతూ అల్లరి మూకలు దాడి చేసినప్పుడు ఆ ముస్లిం గ్రామ పెద్ద వారిని కాపాడారు. ఆ సంఘటనలు తలుచుకుంటే ఇప్పటికీ భయంగా ఉంటుందని ఇషార్ దాస్ చెప్పారు. తరువాత వాళ్లు దిల్లీ ఎలా చేరుకున్నారో ఇషార్‌కు గుర్తు లేదు. ప్రస్తుతం ఆయన దిల్లీలోనే నివాసముంటున్నారు.

ఈ కథ విన్న తరువాత స్పర్శ్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. తన తాత గురించి మొదటిసారి తెలుసుకున్న భావన కలిగింది. అలాగే, స్పర్శ్‌లో ఒక లక్ష్యాన్ని రగిలించింది.

"కథ విన్న వెంటనే మా తాత నివసించిన గ్రామానికి వెళ్లాలనే బలమైన కోరిక కలిగింది. మేం అక్కడికి వెళ్లి చూస్తే తప్ప మా కుటుంబ కథ పరిపూర్ణం కాదనిపించింది" అని స్పర్శ్ చెప్పారు.

బేలా గ్రామానికి వెళతానని స్పర్శ్ తన తాతకు చెప్పారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. అక్కడకు వెళ్లడం సురక్షితం కాదని మందలించారు. అక్కడేం మిగల్లేదన్నారు.

వెళ్లొద్దని అంటున్నా ఇషార్ దాస్ బేలా గ్రామాన్ని "నా ఇల్లు" అని పిలవడం స్పర్శ్ గమనించారు. దాంతో, స్పర్శ్ సంకల్పం మరింత బలపడింది.

"నేను భారత్‌లో పుట్టాను. ఆస్ట్రేలియాలో పెరిగాను. పై చదువులకు బ్రిటన్ వెళ్లాను. నేను ఏ దేశానికి చెందినవాడినో నాకు స్పష్టంగా తెలీదు. "ఇది నాది" అన్న భావన నాకు ఏ ప్రాంతంతోనూ కలుగలేదు. ఈ పజిల్‌లో ఒక ప్రాంతం మిస్ అయినట్టు అనిపించింది. బేలా గ్రామానికి వెళ్లాల్సిందే అనుకున్నా" అని స్పర్శ్ చెప్పారు.

పూర్వీకుల గ్రామానికి ప్రయాణం..

2021 మార్చిలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకున్నారు స్పర్శ్. అక్కడి నుంచి బేలా గ్రామం 100 కిమీ పైనే. అక్కడికి వెళ్లే రోజు స్పర్శ్ సంప్రదాయ దుస్తులు ధరించారు. నీలం రంగు సల్వార్ కమీజ్ వేసుకుని, తెల్లటి పగిడీ పెట్టుకుని తన తాతలాగ తయారయ్యారు. తన తాత చిన్నప్పటి ఫొటోలు చూసి ఆ వేషం కట్టారు స్పర్శ్. తన ఇద్దరు స్నేహితులతో కలిసి బేలాకు ప్రయాణమయ్యారు. తన తాత ఇచ్చిన గుర్తులను మ్యాప్ గీసుకున్నారు.

"వాళ్ల ఊరిలో ఒక మసీదు, ఒక చెరువు, ఒక కొండ ఉండేవని మా తాత చెప్పారు. ఆ కొండని వాళ్లు "ప్రతిధ్వనించే కొండ" అని పిలిచేవారని చెప్పారు. ఆ కొండెక్కి గట్టిగా అరిచేవారని, తమ పేర్లను పిలిచేవారని, కొండలో ఆ పేర్లు ప్రతిధ్వనించేవని చెప్పారు. కానీ, అక్కడకు వెళ్లాక ఏమి లేకపోతే, నేను చాలా నిరాశపడతాను. ఇదొక్కటే నా భయం. ప్రయాణంలో ఇదే ఆలోచించాను" అని స్పర్శ్ అన్నారు.

మెల్లగా, వారి వాహనం కొండలవైపు ప్రయాణించింది. వాళ్ల తాతయ్య చెప్పినట్టే ఎర్ర మట్టి నేల కనిపించింది. కిటీకీ లోంచి చూస్తే రోడ్డు పక్కన పల్లీలు అమ్ముతూ కొందరు కనిపించారు. స్పర్శ్‌కు తన ముత్తాత గుర్తొచ్చారు.

ఒక చెరువు కనిపించింది. పండ్ల చెట్లు, ఆవులు కనిపించాయి. పక్కనే బేలా అని రాసి ఉన్న బోర్డు కనిపించింది. కారు దిగి తనకొచ్చిన పంజాబీలో ఒక మహిళతో మాట్లాడారు. తను ఎందుకు అక్కడికి వచ్చానో చెప్పారు.

’మీరు చెబుతున్నవాళ్ల గురించి నాకేమీ తెలీదు. మా గ్రామ పెద్దకు ఏమైనా తెలిసుండవచ్చని" ఆమె చెప్పారు.

మళ్లీ కారెక్కి గ్రామంలోకి ప్రవేశించారు. అక్కడ అందరూ వీళ్లను వింతగా చూడడం ప్రారంభించారు. ఎవరీ కొత్త వ్యక్తులని ఆశ్చర్యంగా చూశారు. వెంటనే ఆ వార్త గ్రామంలో పొక్కింది.

"బేలా గ్రామం మూడు భాగాలుగా ఉంది. మూడో భాగంలోకి మేం అడుగుపెట్టేసరికే మా గురించి అక్కడి వాళ్లకు తెలిసిపోయింది" అని స్పర్శ్ చెప్పారు.

స్పర్శ్ అక్కడి గ్రామ పెద్దను కలిశారు. తన తాత తనకు చెప్పిన కథను చెప్పారు. 75 ఏళ్ల క్రితం ఒక ముస్లిం వ్యక్తి తన తాత కుటుంబాన్ని కాపాడారని చెప్పారు.

"అంతా విని ఆయన కొంతసేపు మౌనం వహించారు. తరువాత, మీరు చెబుతున్నది మా నాన్న గురించే అన్నారు."

విభజన సమయంలో ప్రస్తుత గ్రామ పెద్ద చిన్న కుర్రవాడు. స్పర్శ్ వాళ్ల తాత, ఆయన కుటుంబం తనకు గుర్తున్నారని చెప్పారు. అది వినగానే స్పర్శ్ భావోద్వేగానికి గురయ్యారు.

"మీ నాన్న లేకపోతే నేను ఈ రోజు భూమి మీద ఊపిరి పీల్చి ఉండేవాడిని కాను" అని స్పర్శ్ ఆయనతో చెప్పారు.

గ్రామ పెద్ద స్పర్శ్‌ను తన ఇంటికి తీసుకెళ్లి, తన కుటుంబానికి పరిచయం చేశారు. విభజన సమయంలో అల్లర్ల నుంచి ఆ గ్రామ పెద్ద కుటుంబం ఎలా ప్రాణాలు కాపాడుకుందో స్పర్శ్‌కు చెప్పారు. స్పర్శ్‌కు మరో కథ తెలిసింది.

బేలాలో సర్శ్

'అక్కడకు వెళ్లగానే నేను ఏడ్చేశా'

ఇషార్ దాస్‌ను కాపాడిన ముస్లిం గ్రామ పెద్ద ముని మనుమడు, స్పర్శ్‌కు ఊరంతా తిప్పి చూపించారు. గ్రామంలో ఒక భవనాన్ని చూపించి "మీ తాత చెప్పిన మసీదు ఇదే. దీని పక్కనే వాళ్లు ఉండేవారు" అని చెప్పారు. పక్కనే ఉన్న ఒక ఇంటిని చూపించి ఆ జాగాలోనే ఒకప్పుడు ఇషార్ దాస్ కుటుంబం నివసించేదని చెప్పారు.

స్పర్శ్ మోకాళ్లపై కూలబడి, అక్కడి నేలను తాకారు. పైకి లేచి గ్రామ పెద్ద మనుమడిని కౌగలించుకున్నారు. ఒక హిందూ, ఒక ముస్లిం ఆనందంగా ఒకరినొకరు వాటేసుకున్న క్షణం అది.

ఆ క్షణం తాను ఎంతో భావోధ్వేగానికి గురయ్యానని, కన్నీళ్లు వచ్చాయని స్పర్శ్ చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య ఉన్న పరిస్థితులు చూస్తే, తను ఎప్పటికైనా అక్కడకు చేరుకోగలనన్న నమ్మకం కలగలేదని అన్నారు. తన కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

బేలా వెళ్లక ముందు తన జీవితంలో కొంత భాగం కోల్పోయాననే బాధ, కోపం ఉండేదని, అక్కడకు వెళ్లొచ్చాక ఆ ఆక్రోశమంతా తగ్గిందని స్పర్శ్ చెప్పారు.

"నా పిల్లలకు నా కథ చెప్పాలి. మనం ఫలనా ప్రాంతం నుంచి వచ్చాం. ఇప్పుడు దాన్ని కోల్పోయాం అని చెప్పను. ఆ నేలను మనం కోల్పోయాం. కానీ, మళ్లీ మనం అక్కడకు వెళ్లగలిగాం. ఈ చట్రం ఇప్పుడు పూర్తయింది అని చెప్తాను" అన్నారు స్పర్శ్.

తన తాత నివసించిన ప్రాంతం నుంచి కొన్ని గులకరాళ్లను ఏరి తెచ్చుకున్నారు స్పర్శ్.

బేలా నుంచి ఇస్లామాబాద్ తిరిగి వచ్చిన తరువాత, తన తాతకు వాట్సాప్‌లో తన ప్రయాణం గురించి చెప్పారు.

"నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. నా మాతృభూమి మీద నువ్వు కాలు పెట్టావు. ఈ భావనను నేను మాటల్లో వర్ణించలేను" అంటూ ఇషార్ దాస్ మనుమడిని మెచ్చుకున్నారు.

పోజెక్ట్ దాస్తాన్

'ఇదంతా చాలా సంక్షిష్టతో కూడుకున్న వ్యవహారం'

ఇలాంటి విభజన కథలెన్నో. ఇప్పుడు బేలా గ్రామ పెద్ద కుటుంబం, ఇషార్ దాస్ కుటుంబం ఒకరితో ఒకరు టచ్‌లో ఉన్నారు. పండుగలకు, పబ్బాలకు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఒకప్పుడు బేలా గ్రామంలో ఇషార్ దాస్ కుటుంబం, ముస్లిం గ్రామ పెద్ద కుటుంబం ఎలా సన్నిహితంగా ఉండేవో, ఇప్పుడు వాళ్ల మనుమలు కూడా అదే సంబంధాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. విషయాలు ఎల్లప్పుడూ సున్నితంగా సాగవు. ఇరు కుటుంబాల్లోనూ అతివాద ధోరణులు ఉన్నవారు ఉన్నారు. సోషల్ మీడియాలో వీరు ఒకరికొకరు ఎదురుపడుతుంటారు. అప్పుడు రెండు కుటుంబాల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వస్తుంటాయి.

ఎప్పుడైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఇషార్ దాస్ గాబరాపడతారు. బేలా గ్రామంలో గ్రామ పెద్ద కుటుంబం ఎలా ఉందోనని ఆందోళన పడతారు.

తమ కుటుంబంలో బీజేపీ హిందుత్వకు మద్దతిస్తూ, యాంటీ-ముస్లిం నినాదాలు చేసేవారు ఉన్నారని, వాళ్ల కుటుంబంలో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ పాలనను సపోర్ట్ చేసేవాళ్లు ఉన్నారని, "ఇదంతా చాలా సంక్షిష్టతో కూడుకున్న వ్యవహారమని" స్పర్శ్ అంటారు.

తన తాత కథతో స్ఫూర్తి పొందిన స్పర్శ్, తన యూనివర్సిటీ స్నేహితులతో కలిసి 'ప్రాజెక్ట్ దాస్తాన్‌'ను ముందుకు తీసుకొచ్చారు. ఇది ఒక వర్చువల్ రియాలిటీ ప్రోగ్రాం. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ఉన్నవారికి చరిత్రలో తాము కోల్పోయిన నేలను చూపించే సాంకేతికత ఇది.

స్పర్శ్ తన తాత ఇషార్ దాస్‌కు ఈ హెడ్ సెట్ పెట్టి వర్చువల్‌గా ఆయన్ను బేలా గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడి మసీదు, ఆయన నివసించిన ప్రాంతం అన్నీ చూపించారు.

ఇదంతా చూశాక 82 ఏళ్ల ఇషార్ దాస్‌కు తన స్వగ్రామానికి మళ్లీ వెళ్లాలనే కోరిక పుట్టింది. కానీ, ఆయనకు భారతదేశ పాస్‌పోర్ట్ ఉండడంతో సరిహద్దులు దాటడం అంత సులువు కాదు.

బేలా నుంచి తీసుకొచ్చిన గులకరాళ్లను స్పర్శ్ తన తాతకు ఇచ్చారు. అందులో ఒక రాయిని ఇషార్ దాస్ తన మంచం పక్కనే టేబుల్‌పై పెట్టుకున్నారు. మిగతా రెండిటినీ నెక్‌లెస్‌లలో పొదిగారు. ఒకటి ఇషార్ దాస్‌కి, ఒకటి స్పర్శ్‌కి. వీళ్లిద్దరూ ఎప్పుడూ ఆ గొలుసులు వేసుకుంటారు. గత చరిత్ర తాలూక గుర్తులను గుండెలపై మోస్తుంటారు.

ఈ గొలుసును తన తరువాతి తరాలకు అందించాలని స్పర్శ్ కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
'Even if I don't want to see my grandfather's village in Pakistan in this life.. I want to become like my grandfather and set foot in Pakistan.. after that..'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X