అందరికీ బాస్..! మనల్ని చూసి తట్టుకోలేడు..! ట్రంప్ పై రాజ్ నాథ్ సెటైర్లు..!
రష్యా చమురు కొంటున్నామనే కారణంతో భారత్ పై ఏకంగా 50 శాతం సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. ఇదే క్రమంలో ఇవాళ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ట్రంప్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అందరికీ బాస్ అని చెప్పుకునే వ్యక్తి (ట్రంప్) భారత్ అభివృద్ధి చెందుతుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాడని విమర్శించారు.
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంటే అగ్రరాజ్యాలు తట్టుకోలేకపోతున్నాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆరోపించారు. కానీ భారత్ సూపర్ పవర్ కాకుండా ఏ శక్తీ ఆపలేదని ఆయన తేల్చిచెప్పేశారు. కొంతమంది భారతదేశ పురోగతిని అంగీకరించలేకపోతున్నారని, వారు దానిని సానుకూలంగా తీసుకోవడం లేదని రాజ్ నాథ్ ఆరోపించారు.భారత్ లో తయారైన వస్తువుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటే వాటిని మరింత ఖరీదైనవిగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ట్రంప్ ను విమర్శించారు.

మన దేశంలో తయారైన ఉత్పత్తులను ఖరీదైనవిగా చేయడం ద్వారా ఇతర దేశాలు వాటిని దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్లు రాజ్ నాథ్ ట్రంప్ సుంకాల్ని అభివర్ణించారు. కానీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న వేగమని, ఏ ప్రపంచ శక్తి కూడా మనం సూపర్ పవర్‌గా మారకుండా ఆపలేదని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ తో పాటు భారత్ ఆత్మనిర్భర్ గా మారేందుకు చేస్తున్న కృషిని కూడా రాజ్ నాథ్ వివరించారు.

పహల్గామ్ ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ..భారతదేశం ప్రపంచ సంక్షేమాన్ని కోరుకుంటుందని, అయితే రెచ్చగొట్టడాన్ని సహించదని రాజ్ నాథ్ తెలిపారు. మనతో ఆడుకోవాలని చూసే వారిని మాత్రం వదిలిపెట్టబోమన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత దళాలు స్వదేశీ పరికరాలను ఉపయోగించాయని, ఇది ఆపరేషన్ విజయంలో కీలక పాత్ర పోషించిందని రాజ్ నాథ్ తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలని ప్రతిజ్ఞ చేయడం వల్లే భారతదేశం ఈ స్థానానికి చేరుకోగలిగిందన్నారు.












Click it and Unblock the Notifications