Must Read:పార్లమెంటులో ఏ బిల్లుకు ఎంత మెజార్టీ అవసరం..!
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. ఇక కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఎన్డీయే కూటమికి ఈసారి పార్లమెంటులో అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే ప్రతిపక్షం కూడా చాలా బలంగా కనిపిస్తోంది. దీంతో అధికార పార్టీ లేదా ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బిల్లులు అంత సులభంగా పాస్ కావనే వాదన వినిపిస్తోంది. ఇంతకీ పార్లమెంటులో బిల్లులు పాస్ అయ్యేందుకు సంఖ్యలు ఎలా ఉండాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణ మెజార్టీ (Simple Majority)
పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టే కొన్ని బిల్లులకు సాధారణ మెజార్టీ మద్దతు లభిస్తే సరిపోతుంది. అంటే సభకు హాజరైన వారిలో 50శాతం కంటే ఎక్కువ మంది బిల్లుకు మద్దతు తెలిపితే చాలు. ఈ తరహా సంఖ్య ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టే సాధారణ బిల్లులు,ఆర్థిక బిల్లులు,వాయిదా తీర్మానం, అవిశ్వాసం,విశ్వాసం, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ప్రకటన, రాష్ట్రపతి పాలన వంటి వాటికి అప్లయ్ అవుతుంది. దీంతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక, రాష్ట్ర అసెంబ్లీలో అవసరమైన రాజ్యంగ సవరణలకు ఈ సింపుల్ మెజార్టీ అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకు లోక్‌సభలో 400 మంది హాజరై ఓటింగ్‌లో పాల్గొంటే ఒక బిల్లు పాసయ్యేందుకు అవసరమైన సంఖ్యాబలం 201. అంటే సగం కంటే ఒకటి ఎక్కువ అని అర్థం.

సంపూర్ణ మెజార్టీ (Absolute Majority)
కొన్ని బిల్లులకు సంపూర్ణ మెజార్టీ అవసరం అవుతుంది. అలాంటి సమయంలో లోక్‌సభలో ఉన్న 545 మంది ఎంపీల్లో 50శాతంకు పైగా ప్రవేశ పెట్టిన బిల్లుకు మద్దతు తెలపాల్సి ఉంటుంది. అప్పుడైతేనే బిల్లు పాస్ అవుతుంది. అంటే 273 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తేనే బిల్ పాస్ అవుతుంది. ఈ బిల్లు కార్యరూపం దాల్చాలంటే రాజ్యసభ మద్దతు కూడా అవసరం. అక్కడున్న 245 మంది ఎంపీల్లో 50శాతం మంది ఎంపీలు అంటే 123 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేస్తేనే పెద్దల సభలో ఆ బిల్లు పాస్ అవుతుంది. ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు చట్టంగా అమల్లోకి వస్తుంది.
ప్రభావవంతమైన మెజార్టీ (Effective Majority)
ఒక బిల్లు పాస్ అయ్యేందుకు ప్రభావవంతమైన మెజార్టీ అసవరం అవుతుంది. దీన్నే ఎఫెక్టివ్ మెజార్టీ అని పిలుస్తాం.దీని ప్రకారం ఒక బిల్లు పాస్ కావాలంటే సభకు హాజరైన ఎంపీల్లో 50శాతంకు పైగా బిల్లుకు మద్దతుగా ఓటేస్తే బిల్ పాస్ అవుతుంది. అంటే మొత్తం సభలో ఉన్న సీట్లు లేదా అప్పటికే ఖాళీగా ఉన్న సీట్లను ఇందులో తీసేసి బిల్లు ప్రవేశపెట్టే సమయానికి ఎంతమంది ఎంపీలు హాజరై ఓటింగ్‌లో పాల్గొంటారో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ తొలగింపునకు,లోక్‌సభ అసెంబ్లీల్లో డిప్యూటీ స్పీకర్ తొలగింపు సమయంలో ఈ ఎఫెక్టివ్ మెజార్టీ అనేది అవసరం పడుతుంది.ఉదాహరణకు లోక్‌సభలో ఐదు ఖాళీలు ఉండి 540 మంది సభ్యులు మాత్రమే ఉంటే బిల్ పాసయ్యేందుకు కావాల్సిన మెజార్టీ 270గా ఉంటుంది.
ప్రత్యేక మెజార్టీ (Special Majority)
కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ఈ ప్రత్యేకమైన మెజార్టీ అవసరం పడుతుంది. రాష్ట్ర జాబితా విషయాలపై చట్టాలు చేయడానికి పార్లమెంటుకు అధికారం ఇచ్చే సమయంలో మూడింట రెండో భాగం (2/3rd) మెజార్టీ అవసరం అవుతుంది.ఇక ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ చేసే సమయం, జడ్జీలు మరియు కాగ్‌ల తొలగింపు, దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడం మరియు శాసనమండలిని రద్దు చేయడం లేదా సృష్టించడం లాంటి సమయంలో మూడింట రెండోవంతు మెజార్టీతో పాటు హాజరైన సభ్యులు ఓటింగ్ మొత్తం సంఖ్యలో 50శాతం కంటే ఎక్కువగా ఉండాలి. ఆర్టికల్ 61 ప్రకారం రాష్ట్రపతి అభిశంసన సమయంలో మొత్తం సభ సంఖ్యాబలంలో మూడింట రెండో వంతు స్పెషల్ మెజార్టీ అవసరం అవుతుంది.ఇలా ప్రతి బిల్లు ఆయా మెజార్టీలను బట్టి పార్లమెంటులో పాస్ చేస్తారు. ఒక బిల్లుకు కావాల్సిన మెజార్టీ రాకపోతే అది లాప్స్ అయిపోతుంది.












Click it and Unblock the Notifications