మే మొదటి వారంలో పార్లమెంట్ మార్చ్: రైతు సంఘాల పిలుపు, వరుస కార్యక్రమాలివే
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా ఏప్రిల్ 1 నుంచి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు రైతు సంఘాల నేతలు. ఏప్రిల్ 10న కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేని 24 గంటలపాటు బ్లాక్ చేయనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నేతలు బుధవారం సాయంత్రం చెప్పారు.
అంతేగాక, మే నెల ప్రథమార్థంలో పార్లమెంటు మార్చ్ చేపట్టాలని నిర్ణయించారు. అయితే, ఈ మార్చ్ ఏ రోజు నిర్వహించేది మాత్రం త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నాలుగు నెలలకు పైగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

పార్లమెంట్ మార్చ్ లో రైతులతోపాటు కార్మికులు, మహిళలు, దళితులు, ఆదివాసీలు, బహుజనులు, నిరుద్యోగ యువత పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ మార్చ్ లో పాల్గొనేందుకు నిరసనకారులంతా సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ ప్రాంతాలకు వాహనాల్లో చేరుకుంటారని, అక్కడ్నుంచి పాదయాత్రగా బయల్దేరి వెళ్తారని వివరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాకా పోరాటం ఆగదని తేల్చి చెప్పారు.
రైతు నేతలు పలు కార్యక్రమాలను నిర్దేశించుకున్నారు. వాటిలో ఏప్రిల్ 5న దేశంలోని ఎఫ్‌సీఐ కార్యాలయాల ముట్టడి, ఏప్రిల్ 10న కుండ్లీ-మనేసర్-పల్వాల్(కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వే 24 గంటలపాటు దిగ్భంధం, ఏప్రిల్ 13న వైశాఖీ పండగను ఢిల్లీ సరిహద్దులో జరపాలని నిర్ణయించారు. ఏప్రిల్ 14న రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నిర్వహణ, మే 1న కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
ఇది ఇలావుండగా, వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ తన నివేదికను సమర్పించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు మార్చి 19న ఈ నివేదికను షీల్డ్ కవర్ లో అందజేశారు. కాగా, తదుపరి విచారణలో ఈ నివేదిక బహిర్గతం కానుందని కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ తెలిపారు. సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించడంతో తమ పని ముగిసిందన్నారు.












Click it and Unblock the Notifications