ఆ మంత్రిని తొలిగించాలి -కనీస మద్దతు ధరకు చట్టబద్ధత : ప్రధానికి ఆరు డిమాండ్లతో రైతుల లేఖ..!!
కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రధాని ప్రకటించినా రైతులు వెనక్కు తగ్గటం లేదు. చట్టాలు పూర్తిగా రద్దయ్యే వరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. ఉద్యమం ప్రారంభించి ఏడాది అవుతున్న సందర్బంగా రైతు సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించారు. ఇదే సమయంలో ప్రధానికి ఆరు డిమాండ్లతో బహిరంగ లేఖ రాసారు. 'సంయుక్త కిసాన్ మోర్చా'తో చర్చలను ప్రభుత్వం తక్షణమే తిరిగి ప్రారంభించి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

ఆరు డిమాండ్లు పరిష్కరించాలి
తాము రోడ్ల మీద కొనసాగాలని కోరుకోవటం లేదని.. తమ సమస్యలు పరిష్కరిస్తే వెంటనే ఇళ్లకు వెళ్తామని స్పష్టం చేసారు. రైతులు ప్రధానికి రాసిన లేఖలో ప్రధానంగా లఖీంపూర్ ఘటన నేపథ్యంలో.. కేంద్ర మంత్రి అజయ్‌మిశ్రాను వెంటనే పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. దీంతో పాటుగా..కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 'విద్యుత్తు సవరణ బిల్లు 2020/2021' ముసాయిదాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ ప్రధాని ముందుంచారు.

ఆ మంత్రిని తొలిగించాలి..అరెస్ట్ చేయాలి
వ్యవసాయ వ్యర్థాల దహనం చేసే రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం 'కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ ఎడ్జాయినింగ్ ఏరియాస్ యాక్ట్ 2021'లోని 15వ సెక్షన్ కల్పిస్తోందని.. ఆ సెక్షన్‌ను తొలగించాలని కోరారు. గతేడాది జూలైలో రైతులు ఉద్యమించినప్పుడు.. ఢిల్లీ, హరియాణా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మరిన్ని రాష్ట్రాల్లో వేలాది మంది రైతులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని గుర్తు చేస్తూ... వాటన్నింటినీ తక్షణం ఉపసంహరించుకోవాలని ప్రధానికి లేఖ ద్వారా స్పష్టం చేసారు.

రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి
నిరసనల క్రమంలో చనిపోయిన 700మంది కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. వారి స్మారకస్థూపానికి సింఘూలో భూమి కేటాయించాలని డిమాండ్ చేసారు. ఈ ఆరు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం చర్చలను ప్రారంభించేవరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ఎస్‌కేఎం ఆధ్వర్యంలో వివిధ రైతు సంఘాల నేతలు ఢిల్లీ సరిహద్దులోని సింఘూలో ఆదివారం సమావేశమై చర్చించారు. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ నెల 27న ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

నిరసనల కొనసాగింపు యథాతధం
అయితే గతంలో నిర్ణయించిన మేరకే ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. 27న భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరగనున్నప్పటికీ అప్పటివరకూ తలపెట్టిన నిరసన కార్యక్రమాలు యథాతథంగా నిర్వహిస్తామని చెప్పారు. సోమవారం లఖ్‌నవూలో తలపెట్టిన 'మహాపంచాయత్' యథావిధిగా జరుగుతుందని తెలిపారు. ఆందోళనల సమయంలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం అందించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు.
Recommended Video

కేంద్రం కసరత్తు..కేబినెట్ లో నిర్ణయం
700 మందికి పైగా రైతుల బలిదానాలను ప్రధాని మోదీ, ఆయన సర్కారు గుర్తించలేదని.. తెలంగాణ సర్కారు గుర్తించిందని కొనియాడారు. ఇక, ఈ నెల 24 జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలోనే ఈ బిల్లుల ఉప సంహరణకు సంబంధించిన నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజునే ఆ మూడు చట్టాల ఉప సంహరణ నిర్ణయం పూర్తి చేసే విధంగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications