నిన్న యువతి ఆత్మహత్యాయత్నం, నేడు కస్టడీలో ఆమె తండ్రి మృతి
లక్నో: తనపై అత్యాచారానికి పాల్పడ్డ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఓ మహిళ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ఎదుట ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే.
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఎమ్మెల్యే.. తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఆయన ఆదేశించి గంటలు కూడా గడవకముందే.. బాధితురాలి తండ్రి పోలీస్ కస్టడీలో మృతి చెందడం గమనార్హం.

ఆత్మహత్యాయత్నం అనంతరం బాధితురాలు మాట్లాడుతూ.. 'నేను రేప్ చేయబడ్డాను. గడిచిన సంవత్సర కాలంగా న్యాయం కోసం ప్రతీ చోట తిరుగుతూనే ఉన్నాను. అయినా నా వాదన ఎవరూ వినడం లేదు. నిందితులందరిని అరెస్ట్ చేయాలి,
లేనిపక్షంలో నేనే ఆత్మహత్య చేసుకుంటా. ఈ విషయంలో సీఎంను సంప్రదించినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. కేసులో ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి మాకు బెదిరింపులు మొదలయ్యాయి.' అంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కుల్దీప్ మాత్రం ఇదంతా ప్రీ-ప్లాన్డ్ డ్రామా అని కొట్టిపారేశారు. 'వాళ్ల కుటుంబంలో ఒక సంఘటన జరిగింది, దానిపై కేసు కూడా నమోదైంది. ఇద్దరు అమాయకుల్ని ఆ కుటుంబం బలిపశువులను చేయబోతే పోలీసులే కాపాడారు' అని ఆయన చెప్పుకొచ్చారు.
తనపై బురద జల్లడానికి వాళ్లకు ఎలాంటి వేదిక దొరకలేదని, అందుకే ఇలా సీఎం ఇంటి ముందు ఆత్మహత్య డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి నిజానిజాలను నిర్దారించాలని దర్యాప్తు సంస్థలను ఆదేశించారు.
అదనపు డీజీపీ, రాజీవ్ కృష్ణ ఈ ఘటనపై స్పందిస్తూ.. 'కుల్దీప్ తనపై అత్యాచారం చేశాడని, అయినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆ మహిళ చెబుతున్నారు. ఎమ్మెల్యే మనుషులు తమను కొట్టారని కూడా చెబుతున్నారు. విచారణలో తేలిందేంటంటే.. ఎమ్మెల్యే కుటుంబానికి, ఆ మహిళ కుటుంబానికి గత 12ఏళ్లుగా వివాదాలు ఉన్నాయి.' అని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications