రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో బెయిల్: సత్యమే తన ఆయుధమన్న మాజీ ఎంపీ
గాంధీనగర్: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. సోమవారం సూరత్ సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, కిందికోర్టు తనకు విధించిన జైలు శిక్ష తీర్పుపై అప్పుడే తీర్పు చెప్పలేమని వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 13కు వాయిదా వేసింది.
మోడీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల సూరత్ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం రాహుల్ గుజరాత్ లోని సూరత్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకున్నారు. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా ఆయన వెంట వచ్చారు.

సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ హాజరయ్యారు. భారీ భద్రత మధ్య అక్కడికి చేరుకున్నారు. ఈ కేసులో తనను దోషిగా తేల్చడంపై స్టే విధించాలని, జైలు శిక్షను సస్పెండ్ చేయాలని అందులో కోరారు. అయితే, అవతలి పక్షం వాదనలు వినకుండా అలాంటి ఆదేశాలు ఇవ్వడం వీలుకాదని కోర్టు స్పష్టం చేసింది. ఇక పరువునష్టం కేసులో ప్రతివాదులు ఏప్రిల్ 10లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. దీనిపై ఏప్రిల్ 13న విచారణ చేపడతామని పేర్కొంది.
ये ‘मित्रकाल’ के विरुद्ध, लोकतंत्र को बचाने की लड़ाई है।
— Rahul Gandhi (@RahulGandhi) April 3, 2023
इस संघर्ष में, सत्य मेरा अस्त्र है, और सत्य ही मेरा आसरा! pic.twitter.com/SYxC8yfc1M
రెండేళ్ల జైలు శిక్ష విధించిన క్రమంలో రాహుల్ గాంధీపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేసింది. దీంతో కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. కాగా, బెయిల్ లభించిన అనంతరం రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను మిత్రకాల్ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తన ఆయుధం, మద్దతు సత్యమేనని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications