Covaxin: భారత్ బయోటెక్‌కు కేంద్రం భారీ గ్రాంట్: డబుల్ గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్‌ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. 65 కోట్ల రూపాయల మొత్తాన్ని గ్రాంట్‌గా మంజూరు చేసింది. బెంగళూరులో భారత్ బయోటెక్‌కు చెందిన ప్లాంట్‌లో కోవాగ్జిన్ ఉత్పత్తిని రెట్టింపు చేయడానికి ఈ నిధులను వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. మిషన్ కోవిడ్ సురక్ష కింద ఈ నిధులను మంజూరు చేసినట్లు పేర్కొంది.
కరోనా వైరస్ వ్యాక్సిన్ కొరత దేశవ్యాప్తంగా తలెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని అధిగమించడానికి భారత్ బయోటెక్ తన కోవాగ్జిన్ టీకా ఉత్పత్తిని రెట్టింపు చేయదలిచిందని వెల్లడించింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతోన్న వ్యాక్సిన్‌తో అంకెలతో పోల్చుకుంటే.. మే-జూన్ మధ్యకాలంలో ఆరేడు రెట్లు అధికంగా ఉత్పాదకత ఉండేలా భారత్ బయోటెక్ ప్రణాళికలను రూపొందించుకుందని పేర్కొంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం తనవంతు సహాయంగా 65 కోట్ల రూపాయల మొత్తాన్ని గ్రాంట్‌గా విడుదల చేసినట్లు శాస్త్ర, సాంకేతిక శాఖ తెలిపింది.

వచ్చే సెప్టెంబర్ నాటికి భారత్ బయోటెక్.. తన కోవాగ్జిన్ టీకాను నెలకు 10 కోట్ల డోసుల వరకు పెంచుతుందని అంచనా వేస్తున్నట్లు కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. దీనికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని గ్రాంట్ రూపంలో అందించినట్లు తెలిపింది. మిషన్ కోవిడ్ సురక్ష కింద విడుదల చేసినట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగంలో ఉన్న మరో మూడు కంపెనీలు కూడా తమ వ్యాక్సిన్ రోజువారీ ఉత్పాదకతను రెట్టింపు చేయడానికి సన్నద్ధం అయ్యాయని పేర్కొంది. రానున్న రోజుల్లో వ్యాక్సిన్ కొరత తీరుతుందని ఆశిస్తున్నట్లు శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ చెప్పింది.
రెండేళ్ల నుంచి 18 సంవత్సరాల లోపు వయస్సున్న వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేలా కోవాగ్జిన్‌ను డెవలప్ చేసింది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ చేపట్టబోతోంది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టడానికి సబ్జెక్ట్ టు ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) భారత్ బయోటెక్‌కు అనుమతి ఇచ్చింది. మూడోదశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టడానికి అనుమతి ఇవ్వొచ్చిన డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి సిఫారసు చేసింది. ఇక డీసీజీఐ అనుమతి మాత్రమే మిగిలి ఉంది. మరో నాలుగైదు రోజుల్లో భారత్ బయోటెక్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications