ముంబై షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం .... 14 ఫైర్ ఇంజన్ లతో మంటలు ఆర్పే యత్నం
ముంబై నగరానికి విపత్తులు పొంచి ఉన్నాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకపక్క ముంబై నగరాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న సమయంలో, మరోపక్క ఊహించని ఉపద్రవాలు ముంబై నగరాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఈరోజు ఉదయం పశ్చిమ ముంబై నగరంలోని బోరివాలిలో ఉన్న ఒక షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్ లో మంటలు చెలరేగి అవి అంతకంతకూ పెద్దవి అవుతున్నాయి.
విపత్తు నివారణ కోసం అగ్నిమాపక సిబ్బంది 14 ఫైర్ ఇంజన్ లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ప్రమాదకరంగా మారి చుట్టూ వ్యాపిస్తున్న నేపథ్యంలో షాపింగ్ మాల్ చుట్టూ ఉన్న నివాస ప్రాంతాలను ఖాళీ చేయించారు అధికారులు. ప్రమాదకరంగా మంటలు మారడంతో లెవెల్ 4 గా అగ్నిమాపక సిబ్బంది గుర్తించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకపక్క ముంబై నగరాన్ని కరోనా, మరోపక్క ఇటీవల విపరీతంగా కురుస్తున్న వర్షాలు వేధిస్తుంటే, ఇటువంటి ఘటనలు ముంబై నగరానికి ప్రాణసంకటంగా తయారయ్యాయి.

ప్రస్తుతం ఇంకా షాపింగ్ మాల్ లో మంటలను అదుపు చేసే ప్రయత్నం కొనసాగుతోంది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే అవకాశం ఉంది.ఈ ఘటనలో షాపింగ్ మాల్ కు సంబంధించిన తీవ్ర ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అసలే ఇరుకుగా ఉండే ముంబై నగరంలో ఇటువంటి ఘటనలు ప్రజల ప్రాణాలకు సంకటంగా పరిణమిస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా పశ్చిమ ముంబై ఉలిక్కిపడింది.













Click it and Unblock the Notifications