జనవరి 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం: వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కర్నాల్, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో 4 ప్రైమరీ వ్యాక్సిన్ స్టోర్ల(జీఎంఎస్‌డీ)లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. ఈ స్టోర్లలో పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను పంపిణీ కోసం నిల్వ చేయడం జరుగుతుందని వెల్లడించారు.
కోవిడ్ 19 హాట్‌స్పాట్‌గా మారిన మరో లగ్జరీ హోటల్: 20 ఉద్యోగులకు కరోనా పాజిటివ్

వారు కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు
ఎన్ని వ్యాక్సిన్లు, ఏయే ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం జరిగింది అనేది డిజిటల్ రూపంలో పరిశీలించడం జరుగుతుందని రాజేష్ భూషణ్ తెలిపారు. దేశంలో దశాబ్ద కాలం నుంచే ఈ సౌకర్యాన్ని కలిగివున్నామని చెప్పారు. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. వారికి సంబంధించిన అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని, కో-విన్(Co-WIN) వ్యాక్సిన్ డెలివర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఈ సమాచారాన్ని తీసుకోవడం జరుగుతుందన్నారు.

71 మందికి సోకిన యూకే కరోనా వైరస్
దేశంలో 71 మంది యూకేలో కనుగొనబడిన మ్యుటెంట్ వైరస్ బారినపడ్డారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలగామ్ భార్గవ తెలిపారు. అంతేగాక, దేశంలో వ్యాక్సిన్ ఎగుమతులపై ఎలాంటి నిషేధాలు లేవని స్పష్టం చేశారు.

జనవరి 13 నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం
జనవరి 13న మనదేశంలో తొలి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోందని, పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని చెప్పారు. కాగా, ఇప్పటికే కోవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ రెండు వ్యాక్సిన్లనే ఇవ్వనున్నారు. కోవాగ్జిన్ టీకాను హైదరాబాద్ ఫార్మా దిగ్జం భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. ఆక్స్‌ఫర్డ్, ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా సంస్థలతో కలిసి కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసింది. ఈ రెండు వ్యాక్సిన్లు కూడా పూర్తిగా సురక్షితమని భారత డ్రగ్ రెగ్యూలేటర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.