పహల్గామ్ టెర్రరిస్ట్ ఫస్ట్ ఫొటో- AK 47
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో టూరిస్టులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల ఫొటో వెలుగులోకి వచ్చింది. ఏకే-47తో యథేచ్ఛగా కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్లో ఒకడి ఫొటోను ఇండియాటుడే సంపాదించింది. గ్రే కలర్ కుర్తా పైజామా ధరించిన ఆ ఉగ్రవాది ఏకే-47 పట్టుకుని ఉండటం ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)కు చెందిన క్రియాశీలక జిహాదీ గ్రూప్‌నకు చెందిన ఉగ్రవాదిగా భావిస్తోన్నారు ఇతన్ని. పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తోన్న లష్కర్-ఎ-తొయిబాకు అనుబంధంగా జమ్మూ కాశ్మర్‌లో ఏర్పాటైందీ ది రెసిస్టెన్స్ ఫ్రంట్. పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఈ దాడికి తామే బాధ్యత వహిస్తోన్నట్లు ప్రకటించింది.

హిందువులను మాత్రమే తమ కిరాతకచర్యకు బలి తీసుకుంది టీఆర్ఎఫ్. వారి ఆధార్ కార్డులను సైతం పరిశీలించినట్లు చెబుతున్నారు. ముస్లిమేతరులపై కాల్పులు జరిపారు. ఈ నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు. జల్లెడ పడుతున్నారు.
పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. పహల్గామ్ బైస్రాన్ జనరల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని పర్యాటక ప్రదేశాలు, ఇతర సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. దేశ రాజధాని సైతం అప్రమత్తం అయింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా పలు నగరాల్లో రెడ్ అలర్ట్ జారీ అయింది.
ఆర్టికల్ 370 రద్దయిన తరువాత చోటు చేసుకున్న అతిపెద్ద ఉగ్రవాద దాడి ఇదే. అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడి ఉదంతం.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉలిక్కిపడేలా చేసింది. తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తించింది.
పహల్గామ్ దాడికి నిరసనగా అక్కడి టాక్సీ డ్రైవర్లు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో శాంతియుతంగా ఈ నిరసన ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు కొనసాగాయి. బారాముల్లా, శ్రీనగర్, పూంచ్, అఖ్నూర్, కుప్వారాల్లో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జమ్మూలో బజరంగ్‌దళ్ కార్యకర్తలు భారీ ర్యాలీ తీశారు.












Click it and Unblock the Notifications