సుప్రీం రాజ్యాంగ ధర్మాసనానికి ఎన్నికల బాండ్ల కేసు-31న కీలక విచారణ..
రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఎలక్ట్రోరల్ బాండ్లు జారీ చేయడం ద్వారా ఎన్నికలకు నిధుల్ని సమీకరించేందుకు ఉద్దేశించిన పథకం చెల్లుబాటుకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో మరో మలుపు తిరిగింది. ఈ కేసుపై విచారణను సుప్రీంకోర్టు ఇవాళ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 31న విచారణ ప్రారంభించనుంది.
రాజకీయ పార్టీలకు అనామక విరాళాలను అందించే ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుబాటుకు సంబంధించిన పిటిషన్ పై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి విచారణ చేసేందుకు సీజేఐ డీవై చంద్రచూడ్ అప్పగించారు. ప్రస్తుత ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ నుండి కనీసం ఐదుగురు న్యాయమూర్తుల పెద్ద బెంచ్‌కు రిఫర్ చేయమని కోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ సమస్య యొక్క ప్రాముఖ్యత కారణంగా కేసును ఇప్పుడు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ కు అప్పగిస్తున్నట్లు తెలిపారు.

అక్టోబర్ 31న ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ముందు ఈ కేసు జాబితా చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఏర్పాటు కోసం విచారణను ఆలస్యం చేయడానికి నిరాకరించింది. విచారణను ఇకపై ఆలస్యం చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వానికి స్పష్టమైన సందేశం పంపింది. ఈ కేసు ఎనిమిదేళ్లుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
అక్టోబర్ 10వ తేదీన జరిగిన విచారణలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఈ కేసును పరిష్కరించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.
2024 లోక్‌సభ ఎన్నికలలోపు ఎలక్టోరల్ బాండ్ల జారీని విచారించి నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్ అయిన ఎన్‌జిఓ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టును కోరారు. దీంతో ఇప్పుడు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని మనీ బిల్లుగా ఆమోదించడానికి సంబంధించిన చట్టపరమైన ప్రశ్నకు కూడా వెళ్లకపోవచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications