సునీల్ కానుగోలు స్థానంలో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త వ్యూహకర్త- కర్ణాటక నుంచి
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది తెలంగాణ. దీనికి సంబంధించిన వేడి రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి ఇక ఎంతో సమయం లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార భారత్ రాష్ట్ర సమితి.. హ్యాట్రిక్‌పై గురి పెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.
అదే సమయంలో కాంగ్రెస్ ఎన్నికలపై దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. కర్ణాటక ఫార్ములాను అనుసరించేలా వ్యూహాలపై కసరత్తు సాగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.

అదే సమయంలో రైతాంగానికి సరఫరా అవుతోన్న ఉచిత విద్యుత్‌పై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా పరిణమించాయి. రైతులకు మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ మాటలదాడిని కొనసాగిస్తోందా పార్టీపై.
ఈ పరిణామాల మధ్య- తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. రాజకీయ వ్యూహకర్త సునీల్ కానుగోలుకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకుంది. ఆయన స్థానంలో పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా మాజీ ఐఎఎస్ అధికారి శశికాంత్ సెంథిల్ కుమార్‌ను అపాయింట్ చేసుకోనుంది. త్వరలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ హెడ్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి ప్రధాన కారకుడు.. సునీల్ కానుగోలు. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారాయన. కాంగ్రెస్ ఎన్నికల టీమ్‌ను నడిపించారు. నియోజకవర్గ స్థాయిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారతీరును ఆయన పర్యవేక్షించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేయగలిగారు.
ఈ నేపథ్యంలో- సునీల్ కానుగోలు రుణాన్ని తీర్చుకున్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అతి కొద్దిరోజుల్లోనే ఆయనకు తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలను అప్పగించారు. తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. సునీల్ కానుగోలును ముఖ్యమంత్రి చీఫ్ అడ్వైజర్‌గా నియమితులయ్యారు.

ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తోన్న నేపథ్యంలో- సునీల్ కానుగోలు పూర్తిస్థాయిలో తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించలేకపోతున్నారని చెబుతున్నారు. అందుకే- వార్ రూమ్ హెడ్, రాజకీయ వ్యూహకర్తగా శశికాంత్ సెంథిల్ కుమార్‌ను నియమించుకోవడానికి కాంగ్రెస్ ఏర్పాట్లు పూర్తి చేశారని తెలుస్తోంది.
శశికాంత్ సెంథిల్ కుమార్ కూడా.. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వ్యూహకర్తగా పని చేశారు. సునీల్ కానుగోలు టీమ్‌లో కీలక సభ్యుడు. తెలంగాణలో పని చేయడానికి 40 మంది సభ్యులతో కూడిన ఓ టీమ్‌ను సెంథిల్ కుమార్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐఎఎస్ అధికారిగా తన అనుభవంతో తెలంగాణలోనూ పార్టీ విజయానికి అవసరమైన వ్యూహాలను రచిస్తారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications