మాజీ సీఎం మైండ్ బ్లాక్, ఆ రోజు ఎమ్మెల్యే సీట్లు, ఇప్పుడు ఎంపీ సీట్లు, మోదీని నమ్ముకుంటే ఇలా?
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాలో తనకు టికెట్ ప్రకటించకపోవడంపై నేను స్పందించనని, ప్రస్తుతం బెళగావి నియోజకవర్గంపై చర్చలు జరుగుతున్నాయని, గురువారం సాయంత్రానికి తన విషయంలో అంతిమ నిర్ణయం తెలుస్తుందని, ఆ తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు జగదీష్ శెట్టర్ మరోసారి బీజేపీ హైకమాండ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికల టిక్కెట్లు కేటాయింపులో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు అన్యాయం జరిగిందని ఆయన వర్గీయులు మండిపడుతున్నారు., లోక్ సభ ఎన్నికల్లో పోటీ గురించి మాట్లాడిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ధారవాడ, హవేరి టిక్కెట్ల పంపిణీపై చర్చలు జరిగాయని, ఇప్పుడు ఆరెండు ఎంపీ టిక్కెట్లను ప్రకటించారని, ఇప్పుడు బెళగావి గురించి చర్చ సాగుతోందని, గురువారం రాత్రిలోపు తాను తుది నిర్ణయం తీసుకుంటానని, ఇప్పుడే తాను ఏ నిర్ణయానికి రాలేనని, బీజేపీ హైకమాండ్ అంతిమ నిర్ణయం తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ మీడియాకు చెప్పారు.

ధారవాడ, హావేరి లోక్ సభ నియోజక వర్గాల్లో ఎక్కడో ఒకచోట తనకు లేదంటే తన కుటుంబ సభ్యులకు బీజేపీ హైకమాండ్ ఎంపీ సీటు ఇస్తుందని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ఎదురు చూశారు. అయితే బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో రెండు లోక్ సభ నియోజక వర్గాల సీట్లు వేరే వాళ్లకు ఇచ్చేశారు. రెండు లోక్ సభ నియోజక వర్గాల్లో తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అసహనం వ్యక్తం చేశారని, మరోసారి బీజేపీ హైకమాండ్ మీద మండిపడుతున్నారని తెలిసింది.
అయితే మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు ఇప్పుడు ఉన్న ఒకేఒక చాన్స్ బెళగావి లోక్ సభ నియోజక వర్గం, అయితే బెళగావి లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి బీజేపీ నుంచి మహామహులు పోటీ పడుతుండటంతో అక్కడా ఆయన కుటుంబ సభ్యులకు అవకాశం చిక్కుతుందా ?, లేదా అని అనుమానాలు ఎక్కువ అవుతున్నాయని జగదీష్ శెట్టర్ వర్గీయులు అంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవడంతో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బహిరంగంగా బీజేపీ హైకమాండ్ మీద దుమ్మెత్తిపోసి తరువాత కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే బీఎస్ యడియూరప్ప రాజీ పంచాయితీలు చేసి మాజీ సీఎం యడియూరప్ప మరోసారి శెట్టర్ ను బీజేపీలోకి తీసుకు వచ్చారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరిన జగదీష్ శెట్టర్ కు మరోసారి బీజేపీ హైకమాండ్ హ్యాండ్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. లోక్ సభ ఎన్నికల సీట్లు కేటాయింపు తరువాత మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ప్రశ్చాతప పడవలసి వస్తుందని ఇటీవల కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ పదేపదే చెప్పారు.












Click it and Unblock the Notifications